నేరం చేసిన‌ట్లు ఒప్పుకోమంటే కుద‌ర‌దన్నాను: సీఐడీ విచార‌ణ‌పై గౌతు శిరీష‌

  • 7 గంట‌ల పాటు శిరీష‌ను ప్రశ్నించిన సీఐడీ
  • మ‌ధ్యాహ్నం భోజ‌నం కూడా పెట్ట‌లేద‌న్న శిరీష‌
  • న్యాయ‌వాదిని కూడా అనుమ‌తించ‌లేద‌ని వెల్లడి   
సోష‌ల్ మీడియాలో పోస్టుల కేసులో టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ గౌతు శిరీష‌ను సీఐడీ అధికారులు సోమ‌వారం దాదాపుగా 7 గంట‌ల పాటు విచారించారు. మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని డీజీపీ కార్యాల‌యంలోని సీఐడీ విభాగంలో జ‌రిగిన ఈ విచార‌ణ ముగిసిన అనంత‌రం డీజీపీ కార్యాల‌యం బ‌య‌ట త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా శిరీష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ కేసులో నేరం ఒప్పుకోవాలంటూ సీఐడీ అధికారులు త‌న‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చార‌ని చెప్పిన శిరీష... అందుకు తాను స‌సేమిరా ఒప్పుకోలేద‌ని వెల్ల‌డించారు. ఈ కేసును న్యాయ‌ప‌రంగానే తాను ఎదు‌ర్కొంటాన‌ని సీఐడీ అధికారుల‌కు చెప్పిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. అంతేకాకుండా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాలంటూ తానెవ‌రికీ చెప్ప‌లేద‌ని కూడా తెలిపాన‌న్నారు.

ఇక విచార‌ణ‌లో భాగంగా సీఐడీ అధికారులు త‌న‌ను ఇబ్బందిపెట్టార‌ని ఆమె ఆరోపించారు. 7 గంట‌ల పాటు విచార‌ణ సాగ‌గా... మ‌ధ్యాహ్నం వేళ త‌న‌కు క‌నీసం భోజ‌నం కూడా పెట్ట‌లేద‌ని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా విచార‌ణ సంద‌ర్భంగా త‌న న్యాయ‌వాది ఉండడానికి కూడా సీఐడీ అధికారు‌లు ఒప్పుకోలేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


More Telugu News