ఆరోగ్య‌శ్రీ జ‌గ‌న్‌ది కాదు.. ప్ర‌ధాని మోదీది: బీజేపీ అధ్యక్షుడు జేపీ న‌డ్డా

  • విజ‌య‌వాడ‌లో శ‌క్తి కేంద్ర క‌మిటీల‌తో న‌డ్డా భేటీ
  • ఆయుష్మాన్ భార‌త్‌ను ఏపీలో ఆరోగ్య‌శ్రీ పేరుగా మార్చారన్న బీజేపీ అధ్యక్షుడు 
  • రాష్ట్రం దాటితే ఆరోగ్య‌శ్రీ ప‌ని చేయ‌దని వెల్లడి  
  • బూత్ క‌మిటీల్లో అన్నివ‌ర్గాల వారికీ చోటివ్వాలని సూచన 
  • ప్ర‌తి బీజేపీ కార్య‌క‌ర్త త‌న ఇంటిపై బీజేపీ జెండా ఎగుర‌వేయాల‌న్న న‌డ్డా
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నడ్డా.. విజ‌య‌వాడ‌లో శ‌క్తి కేంద్ర‌ క‌మిటీ స‌భ్యుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న ఆయుష్మాన్ భార‌త్‌, ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాల గురించి ప్ర‌స్తావించారు.

ఆయుష్మాన్ భార‌త్ పేరిట ఓ బృహ‌త్త‌ర ఆరోగ్య ప‌థ‌కాన్ని కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు అమ‌లు చేస్తోంద‌ని నడ్డా పేర్కొన్నారు. అదే ప‌థ‌కానికి ఆరోగ్య‌శ్రీ అని వైసీపీ ప్ర‌భుత్వం పేరు మార్చింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ప‌థ‌కం ముమ్మాటికీ జ‌గ‌న్‌ది కాద‌ని, ఈ ప‌థ‌కం మోదీద‌ని వెల్లడించారు. అంతేకాకుండా ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం రాష్ట్రం దాటితే చెల్ల‌ద‌ని, ఆయుష్మాన్ భార‌త్ దేశవ్యాప్తంగా ఎక్క‌డికి వెళ్లినా అమ‌లు అవుతుందన్నారు. ఇక ఆయుష్మాన్ భార‌త్ కింద రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

బూత్‌ల వారీగా ప్ర‌జ‌ల‌కు పార్టీని చేరువ చేసే బాధ్య‌త‌ శ‌క్తి కేంద్ర ప్ర‌ముఖుల‌పై ఉంద‌ని న‌డ్డా చెప్పారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో బూత్ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. బూత్ క‌మిటీల‌లో అన్ని వ‌ర్గాల‌కు స్థానం ద‌క్కేలా చూడాల‌ని ఆయ‌న సూచించారు. తద్వారా బీజేపీ ఏ ఒక్క వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితం కాద‌న్న సందేశాన్ని జ‌నంలోకి పంపాల‌ని ఆయ‌న కోరారు. కొత్త వారిని పార్టీలో చేర్చుకునే అంశంపై దృష్టి సారించాల‌ని ఆయ‌న సూచించారు. బీజేపీకి చెందిన ప్ర‌తి కార్య‌క‌ర్త త‌న ఇంటిపై బీజేపీ జెండాను ఎగుర‌వేయాల‌ని ఆయ‌న సూచించారు.


More Telugu News