క్షమాప‌ణ‌లు చెప్పాల్సింది భార‌త్ కాదు, బీజేపీ చెప్పాలి: కేటీఆర్‌

  • మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌ల అనుచిత వ్యాఖ్య‌లు
  • వారిపై స‌స్సెన్ష‌న్ వేటు వేసిన బీజేపీ
  • అంత‌ర్జాతీయ స‌మాజానికి భార‌త్ ఎందుకు క్ష‌మాప‌ణ చెప్పాల‌న్న కేటీఆర్‌
  • ముందుగా భార‌తీయుల‌కు బీజేపీ క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్‌
మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ బ‌హిష్కృత నేత‌లు నుపుర్ శ‌ర్మ‌, న‌వీన్ కుమార్ జిందాల్‌లు చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు పెను దుమార‌మే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్య‌లు చేసిన ఇద్ద‌రు నేత‌ల‌ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌స్పెండ్ చేసిన‌ప్ప‌టికీ... ఆ పార్టీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీ త‌ప్పు చేస్తే.. భార‌త్ ఎందుకు క్ష‌మాపణ‌లు చెప్పాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌స్తావిస్తూ కేటీఆర్ సోమ‌వారం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

బీజేపీ నేత‌లు చేసిన విద్వేష వ్యాఖ్య‌లకు అంత‌ర్జాతీయ స‌మాజానికి భార‌త దేశం ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ మోదీని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఈ వ్య‌వ‌హారంలో బీజేపీ క్ష‌మాపణ‌లు చెప్పాలని, ఓ దేశంగా భార‌త్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. 'నిత్యం విద్వేషపూరిత వ్యాఖ్య‌లు చేస్తున్న బీజేపీ నేత‌లు తొలుత భార‌తీయుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


More Telugu News