కాకినాడ జిల్లాలో అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి

  • ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం
  • రెండు వారాలుగా ప్రజలను హడలెత్తిస్తున్న పులి
  • పశువులను వేటాడుతున్న పులి
  • మూడు చోట్ల బోనులు
  • ఒకచోట బోనులోకి వెళ్లకుండానే వెనుదిరిగిన పులి
కాకినాడ జిల్లాలో గత కొన్నిరోజులుగా పెద్ద పులి అందరినీ హడలెత్తిస్తోంది. ప్రత్తిపాడు మండలంలో రెండు వారాలుగా సంచరిస్తున్న పెద్ద పులి పశువులను చంపుతూ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దీన్ని పట్టుకునేందుకు అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. పులిని ఆకర్షించేందుకు ఆ బోనుల్లో మాంసం కూడా ఉంచారు. 

పొదురుపాక, శరభవరం, వొమ్మంగి ప్రాంతాల్లో మూడు బోనులు ఏర్పాటు చేయగా, వాటిలో శరభవరం బోను వద్దకు వచ్చిన పులి... దాంట్లోకి వెళ్లకుండానే వెనుదిరగడం అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డయింది. పులి తీరుతో అధికారులు నిరాశకు గురయ్యారు. మాంసం ఎరగా వేసినా ఆ పులి బోనులోకి ప్రవేశించలేదు. 

కాగా, ఆ పులి వయసు నాలుగైదేళ్లు ఉంటుందని భావిస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలో ఆహారం, తాగునీటికి ఇబ్బంది లేకపోవడంతో అది ఇక్కడే వేటాడుతూ, ఈ ప్రాంతంలోనే సంచరిస్తోందని అధికారులు చెబుతున్నారు.


More Telugu News