చెన్నై సూపర్ కింగ్స్... ఓటమికి కుంగిపోదు... ఎల్లప్పుడూ తలెత్తుకునే ఉంటుంది: డెవాన్ కాన్వే

  • సీఎస్కే ఆటగాళ్లు ఓటమితో కుంగిపోరన్న కాన్వే
  • తలెత్తుకు తిరగడమే వారికి తెలుసని వెల్లడి 
  • సీఎస్కే క్రికెట్ సంస్కృతిని వివరించిన కివీస్ ఆటగాడు 
ఐపీఎల్ చరిత్రలో నాలుగు టైటిల్స్ ను గెలుచుకున్న సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). అయితే ఇటీవల ముగిసిన 15వ సీజన్ లో పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్ కు వెళ్లకుండానే ఇంటికి తిరుగుముఖం పట్టింది. సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే ఈ అంశంపై మాట్లాడాడు. ఓటమితో కుంగిపోకుండా, తలెత్తుకుని హుందాగా ఉండడమే సీఎస్కే ప్రధాన లక్షణమని చెప్పాడు.

డెవాన్ కాన్వే ఈ సీజన్ లో ఆలస్యంగా సీఎస్కే జట్టులో చేరినప్పటికీ... మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో ఒక ఇన్నింగ్స్ లో 87 పరుగులు సాధించాడు. 

"ఈ టోర్నీలో మాకు గొప్ప చరిత్ర (నాలుగు టైటిళ్లు) ఉంది. ప్లేఆఫ్స్ లో ప్రవేశించాలని కోరుకున్నా సాధ్యపడలేదు. కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మేము ఎంతో మెరుగ్గానే కనిపించాం. కానీ జట్టులో నిలకడ లోపించింది’’అని కాన్వే వివరించాడు.

కొన్ని గేముల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ డ్రెస్సింగ్ రూమ్ లో నిరాశాపూరిత వాతావరణం కనిపించలేదని చెప్పాడు. "భావోద్వేగాలకు గురైతే ఆ ప్రభావం తదుపరి మ్యాచ్ పై ఉంటుంది. ఈ కారణంగానే సీఎస్కే జట్టులో నిరాశానిస్పృహలకు చోటుండదు. అందుకే ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందింది" అని కాన్వే వివరించాడు.


More Telugu News