భారత్ లో నాకు శాపం తగిలింది.. వెళ్లిన ప్రతి సారీ గాయాలు: మిచెల్ మార్ష్
- మొదట చిన్న గాయం
- కోలుకున్న తర్వాత కరోనా బారిన పడ్డా
- అయినా మంచి ప్రదర్శనలు ఇచ్చానన్న మార్ష్
- అందుకే శాపం తగిలినట్టు అనిపించినట్టు ప్రకటన
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుడైన మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు భారత్ లో ఏదో శాపం తగిలిందని చెప్పాడు. ఐపీఎల్ 15వ సీజన్ (2022)కు ముందు మార్ష్ గాయపడడం తెలిసిందే. చివరిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడడానికి వచ్చిన సమయంలోనూ ఆయన గాయానికి గురయ్యాడు.
ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ను డేవిడ్ వార్నర్ తో కలసి మిచెల్ మార్ష్ ఆరంభించడం, 51 పరుగులు చేయడం తెలిసిందే. అంతే కాదు ఈ ఏడాది సీజన్ లో మార్ష్ కరోనా బారిన కూడా పడ్డాడు. ‘‘భారత్ లో కొన్ని వారాల పాటు ఉన్న తర్వాత నాకు శాపం తగిలినట్టు అనిపించింది’’అని మార్ష్ చెప్పాడు. మూడు టీ20 మ్యాచుల కోసం అతడు ప్రస్తుతం కొలంబోలో ఉన్నాడు.
‘‘నాకు మొదట చిన్న గాయం అయింది. దాని నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత ఒక మ్యాచ్ ఆడాను. అనంతరం కొవిడ్ బారిన పడ్డాను. ఇది నిజంగా కుదుపుల్లాంటి ఆరంభం. కానీ, కొన్ని స్థిరమైన ప్రదర్శనలు చేశాను. అక్కడ ఉన్న సమయాన్ని ప్రేమించాను’’అని మార్ష్ ప్రకటించాడు.