కేంద్ర బీజేపీ సర్కారుకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదు?: మంత్రి కేటీఆర్

  • భూత్పూర్‌లో డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌ను ప్రారంభించిన కేటీఆర్‌
  • దేశంలోనే అత్యంత దుర్భిక్షం క‌లిగిన జిల్లా పాల‌మూరు అంటూ కామెంట్  
  • పాల‌మూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామ‌ని మోదీ న‌మ్మ‌బ‌లికారన్న కేటీఆర్ 
  • ఈ 8 ఏండ్ల‌లో 8 పైస‌లు కూడా ఇవ్వ‌లేద‌ని విమర్శ ‌
తెలంగాణ‌లో ప్రాజెక్టుల‌కు జాతీయ హోదా విష‌యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శ‌నివారం పాల‌మూరు జిల్లా భూత్పూర్ ప‌రిధిలో కొత్త‌గా నిర్మించిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో బీజేపీ స‌ర్కారుపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

 దేశంలోనే అత్యంత దుర్భిక్షం ఉన్న జిల్లా పాల‌మూరు జిల్లా అని పేర్కొన్న కేటీఆర్‌... పాల‌మూరు జిల్లా స‌స్య‌శ్యామ‌లం కావాలని కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ య‌త్నాల‌ను కొంద‌రు దుర్మార్గులు అడ్డుకుంటూ సైంధ‌వ పాత్ర పోషిస్తున్నారని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. 

అమ్మ పెట్ట‌దు...అడుక్కు తిన‌నివ్వ‌దు అన్న‌ట్లుగా తెలంగాణ ప‌ట్ల న‌రేంద్ర మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేటీఆర్ ఆరోపించారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామ‌ని దేవ‌ర‌క‌ద్ర‌లో మోదీ న‌మ్మ‌బ‌లికారని గుర్తు చేసిన కేటీఆర్‌... ఇదే విష‌యంపై హైద‌రాబాద్‌లోనూ నాటి బీజేపీ కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్ కూడా ప్ర‌క‌ట‌న చేశార‌న్నారు.

అయినా కూడా ఈ 8 ఏండ్లలో కేంద్రం నుంచి పాల‌మూరు ప్రాజెక్టుల‌కు క‌నీసం 8 పైస‌లు కూడా విడుద‌ల కాలేద‌న్నారు. క‌ర్ణాట‌క‌లోని అప్ప‌ర్ భ‌ద్ర‌కు జాతీయ హోదా ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్ర‌శ్నించారు.


More Telugu News