జల్లయ్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనంటూ రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నేతలు

  • జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు
  • దాచేపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు
  • ఇంటి వద్దే బుద్ధా వెంకన్న అడ్డగింత
  • అక్కడే బైఠాయించి నిరసన తెలిపిన బుద్ధా
జల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న టీడీపీ కార్యకర్త అయిన జల్లయ్యను ప్రత్యర్థులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులు.. జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరారు. వారిని గురజాల నియోజకవర్గం దాచేపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 

దీంతో జీవీ ఆంజనేయులు, కొల్లు రవీంద్రలు రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసుల తీరును ప్రశ్నించారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని ఏమనాలంటూ నిలదీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. 

ఇటు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్ననూ పోలీసులు ఆయన ఇంటి వద్దే అడ్డుకున్నారు. కార్యకర్తలు, అనుచరులతో కలిసి జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన ఆయన్ను పోలీసులు నిలువరించారు. దీంతో ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. 

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు. సీఎం జగన్.. హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. పల్నాడులో బీసీ వర్గానికి చెందిన ముగ్గురు నేతలను చంపేశారని, ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లయ్య మృతదేహానికి నివాళులు కూడా అర్పించకూడదా? అని ప్రశ్నించారు. 

కుటుంబ సభ్యుల సంతకం లేకుండానే జల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఇలా చేయించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లిందంటూ విమర్శించారు. బీసీ నేతల హత్యల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన కుట్రదారుడని ఆయన ఆరోపించారు.


More Telugu News