అప్పుడు చిరంజీవి నాపై కోప్పడ్డారు.. చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు: నాజర్

  • తాను, చిరంజీవి ఒకే యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నామన్న నాజర్ 
  • చిరంజీవి చాలా టాలెంటెడ్ ఆర్టిస్టని కితాబు 
  • తమ మధ్య స్నేహం అలాగే కొనసాగుతోందని వెల్లడి 
మెగాస్టార్ చిరంజీవికి, ప్రముఖ నటుడు నాజర్ కు మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరూ చెన్నైలో ఒకే సమయంలో యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాజర్ మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. చిరంజీవి తాను, ఒకే యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ పొందామని తెలిపారు. 

అప్పట్లో తాను ప్రతిరోజు చెంగల్పట్టు నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చేవాడినని... సమయానికి యాక్టింగ్ స్కూల్ కు రావాలంటే ఉదయం 6 గంటలకే ప్రయాణం చేయాల్సి వచ్చేదని చెప్పారు. ఆ టైమ్ లో అమ్మకు కూరలు చేసే సమయం ఉండకపోయేదని... దీంతో, తాను అన్నం మాత్రం తెచ్చుకునే వాడినని తెలిపారు. చిరంజీవి, ఇతర స్నేహితులు ఆంధ్ర మెస్ నుంచి భోజనాలు తెచ్చుకునేవారని చెప్పారు. 

ఒకరోజు తాను అన్నం మాత్రమే తెచ్చుకున్నాననే విషయం చిరంజీవికి తెలిసి తనపై కోప్పడ్డాడని... పొద్దున్నే వంట చేయమని అమ్మను ఇబ్బంది పెడితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని.. రేపటి నుంచి మాతోనే కలిసి భోజనం చేయాలని చెప్పాడని నాజర్ తెలిపారు. చిరంజీవిది చాలా మంచి మనసు అని అన్నారు. ఆయన టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని చెప్పారు. 

యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ పూర్తయిన వెంటనే చిరంజీవికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, ఆయన పెద్ద స్టార్ అయిపోయాడని నాజర్ తెలిపారు. తనకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదని... దీంతో, ఒక హోటల్ లో వెయిటర్ పని చేశానని చెప్పారు. 

ఒక రోజు తాను పని చేస్తున్న హోటల్ పక్కనే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతోందని.. పెద్ద సంఖ్యలో జనాలు అక్కడ గుమికూడారని.. తాను కూడా అక్కడకు వెళ్లి, కాసేపు షూటింగ్ చూసి వెనక్కి తిరిగి వస్తుండగా... చిరంజీవి తనను గమనించి పిలిచాడని... ఏం చేస్తున్నావ్? అని అడిగాడని తెలిపారు. హోటల్లో ఉద్యోగం చేస్తున్నానని తాను చెప్పగా... ఇంత టాలెంటెడ్ ఆర్టిస్టువి, నీవు హోటల్లో పని చేయడం ఏమిటని ప్రశ్నించాడని... రేపు వచ్చి తనను కలువమని చెప్పాడని అన్నారు. 

అయితే తాను చిరంజీవిని కలవలేదని... ఆ తర్వాత కొన్నాళ్లకు బాలచందర్ గారు ఓ సినిమాలో అవకాశం ఇచ్చారని నాజర్ చెప్పారు. ఆ తర్వాత తాను, తన మిత్రుడు చిరంజీవి కలిసి ఎన్నో చిత్రాల్లో నటించామని తెలిపారు. తన గురించి, తన ఆత్మాభిమానం గురించి చిరంజీవికి బాగా తెలుసని... అందుకే ఆయన తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టడని అన్నారు. ఇప్పటికీ తమ ఇద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోందని చెప్పారు.


More Telugu News