గనుల తవ్వకాల పనుల్లో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించిన టాటా స్టీల్

  • సమాన అవకాశాల నినాదంతో నిర్ణయం
  • ఎర్త్ మూవర్లు, క్రేన్ ఆపరేటర్లుగా ట్రాన్స్ జెండర్లు
  • కొందరికి ట్రైనీలుగా అవకాశం
ట్రాన్స్ జెండర్లపై వివక్షను తొలగించి, వారికి కూడా సమాన అవకాశాలు కల్పించడం ద్వారా టాటా స్టీల్ సంస్థ సరికొత్త ఘనతను సొంతం చేసుకుంది. తమ గనుల తవ్వకాల పనుల్లో ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి కల్పించింది. భారీ ఎర్త్ మూవర్లు, క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా కొందరు ట్రాన్స్ జెండర్లను కూడా విధుల్లోకి తీసుకున్నట్టు టాటా స్టీల్ యాజమాన్యం వెల్లడించింది. అందరికీ సమాన అవకాశాలు అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. 

గతేడాది డిసెంబరు నుంచి ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించామని, వెస్ట్ బొకారో డివిజన్ లో తమ గనుల్లో 14 మందిని ఎర్త్ మూవర్ ఆపరేటర్లుగా నియమించినట్టు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ 12 మందిని క్రేన్ ఆపరేటర్లుగా ఎల్జీబీటీ ప్లస్ వర్గానికి చెందినవారిని తీసుకున్నట్టు వివరించింది. సమ్మిశ్రమం, వైవిధ్యంతో కూడిన పని సంస్కృతిని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ తరహా నియామకాలు చేపట్టినట్టు టాటా స్టీల్స్ వెల్లడించింది.


More Telugu News