మహాత్మాగాంధీ మాటలను గుర్తుచేసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

  • ఉక్రెయిన్ లో భారత రాయబారిగా హర్షకుమార్ జైన్
  • రాజధాని కీవ్ లో అధికారిక కార్యక్రమం
  • హాజరైన దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ
  • మిగతా దేశాల రాయబారులు కూడా వస్తారని ఆకాంక్ష
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగి 100 రోజులవుతోంది. ఇప్పటికీ రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. ఉక్రెయిన్ లో భారత రాయబారిగా నియమితులైన హర్షకుమార్ జైన్ లాంఛనాలను పూర్తి చేసే కార్యక్రమంలో జెలెన్ స్కీ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ, "భయం తొలగిపోయినప్పుడే బలం కలుగుతుంది. బలం అనేది మన శరీరంలో కండరాల సంఖ్యపై ఆధారపడి ఉండదు. వారు మొదట నిన్ను విస్మరిస్తారు, ఆ తర్వాత నిన్ను చూసి నవ్వుతారు, అనంతరం నీతో పోట్లాడతారు, ఆపై నువ్వు విజయం సాధిస్తావు" అంటూ నాడు మహాత్ముడు ప్రవచించిన మాటలను జెలెన్ స్కీ పలికారు. 

భారత రాయబారి అందించిన అధికారిక చిహ్నాలను, పత్రాలను స్వీకరించారు. ఇదే విధంగా అమెరికా, మాల్డోవా రాయబారులు అందించిన చిహ్నాలు, పత్రాలను స్వీకరించారు. తమ దేశంలో ఉండిపోయేందుకు మళ్లీ వచ్చిన విదేశీ రాయబారులను అభినందిస్తున్నానని జెలెన్ స్కీ తెలిపారు. మిగిలిన దేశాల రాయబారులు కూడా త్వరలోనే కీవ్ కు వస్తారని ఆశిస్తున్నట్టు వివరించారు.


More Telugu News