ఏపీలో రేపు కూడా భానుడి విశ్వరూపం తప్పదట!

  • ఏపీలో సూర్య ప్రతాపం
  • పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
  • శనివారం కూడా ఇలాగే ఉంటుందన్న విపత్తు నిర్వహణ సంస్థ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ కు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమికి తోడు వడగాడ్పులు కూడా వీస్తుండడంతో ప్రజల బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో రేపు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అనేక మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, గోకవరం, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వివరించింది. మరో 186 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. 

ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా నీటిని తాగుతుండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగవచ్చని వివరించింది.



More Telugu News