అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో గ్యాస్ లీక్... 300 మందికి అస్వస్థత

  • పోరస్ కంపెనీ నుంచి విషవాయువు లీక్
  • క్వాంటమ్ సీడ్స్ కంపెనీలో పనిచేసే మహిళా కార్మికులపై ప్రభావం
  • స్పృహ కోల్పోయిన కార్మికులు
  • 200 మంది అనకాపల్లి ఆసుపత్రికి తరలింపు
  • 80 మంది అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి తరలింపు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో పోరస్ కంపెనీ నుంచి విషవాయువు లీకైంది. ఈ వాయువు ప్రభావంతో కంపెనీ పక్కనే క్వాంటమ్ సీడ్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాయువు ఘాటుగా ఉండడంతో స్పృహ కోల్పోయారు. దాదాపు 300 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురికాగా, వారిలో 80 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 200 మందిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. 

దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గ్యాస్ లీకేజి ఘటనలో ప్రాణనష్టం లేదని వెల్లడించారు. అయితే పెద్ద సంఖ్యలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కార్మికులకు వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలానికి వెళ్లారని మంత్రి వివరించారు. ప్రమాదానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కాగా, కంపెనీ నుంచి లీకైన వాయువును అమ్మోనియా గ్యాస్ గా భావిస్తున్నారు.

అచ్యుతాపురం ఘటనపై సీఎం జగన్ ఆరా

విశాఖ సమీపంలోని అచ్యుతాపురం ఎస్ఈజడ్ లో గ్యాస్ లీక్ కావడంపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలంటూ స్థానిక మంత్రిని ఆదేశించారు. అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణాలు తెలుసుకుని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



More Telugu News