బంగారు తెలంగాణ అని రైతుకు బ‌తుకే లేకుండా చేశాడు: వైఎస్ ష‌ర్మిల‌

  • రైతు గోస కార్య‌క్ర‌మంలో వైఎస్ ష‌ర్మిల‌
  • ప‌ట్టాలిస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఇటువైపే చూడ‌లేదు
  • ప‌ట్టాలివ్వ‌క‌పోగా భూముల‌ను లాక్కుంటున్నారు
  • అసైన్డ్ భూముల‌నూ లాగేసుకుంటున్నార‌న్న ష‌ర్మిల‌
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోమారు విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై వైఎస్సార్టీపీ నిర్వ‌హిస్తున్న రైతు గోస కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం భారీ సంఖ్య‌లో హాజ‌రైన రైతుల‌తో క‌లిసి ష‌ర్మిల దీక్ష‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా 'రుణ మాఫీ ఎగ్గొట్టిన ముఖ్య‌మంత్రి మ‌న‌కొద్దు' అని రాసి ఉన్న ప్ల‌కార్డును ప‌ట్టుకున్న ష‌ర్మిల‌... కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

70 ఏండ్లుగా కాస్తులో ఉన్న భూముల‌కూ ప‌ట్టాలివ్వ‌డం లేదన్న ష‌ర్మిల‌... ఎన్నిక‌ల ముందు కుర్చీ వేసుకుని ప‌ట్టాలిస్తాన‌ని కేసీఆర్ చెప్పార‌న్నారు. ఆ హామీ ఇచ్చిన త‌ర్వాత ఆయ‌న‌ మ‌ళ్లీ ఇటువైపు చూడ‌లేదని ష‌ర్మిల ఆరోపించారు. ప‌ట్టాలివ్వ‌క‌పోగా ఉన్న భూములు గుంజుకున్నారంటూ కేసీఆర్‌పై ధ్వ‌జ‌మెత్తారు. భూమి లేని నిరుపేద‌ల‌కు ఇచ్చిన‌ అసైన్డ్ భూములనూ లాక్కున్నార‌ని ఆమె ఆరోపించారు. బంగారు తెలంగాణ అని రైతుకు బ‌తుకే లేకుండా చేశారంటూ ఆమె కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు.


More Telugu News