విశాఖపట్టణంలోని షిప్పింగ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. తానా పంపిన రూ.11 కోట్ల కొవిడ్ సామగ్రి బూడిద

  • పెదగంట్యాడలోని శ్రావణి షిప్పింగ్ గోదాములో ప్రమాదం
  • కరోనా సమయంలో తెలుగు ప్రజలకు తానా పంపిన వితరణ
  • కెనడా నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా దిగుమతి
  • పంపిణీకి ఏర్పాట్లు చేస్తుండగానే ప్రమాదం
విశాఖపట్టణం పెదగంట్యాడలోని శ్రావణి షిప్పింగ్ గోదాములో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో రూ. 11 కోట్ల విలువైన కొవిడ్ రక్షణ సామగ్రి కాలిబూడిదైంది. కరోనా మహమ్మారి సమయంలో తెలుగు ప్రజలకు పంపిణీ చేసేందుకు వీలుగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఈ సామగ్రిని సేకరించి పంపించింది. ఇందులో శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు, ఇతర సామగ్రి ఉన్నాయి. కెనడా నుంచి రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా గతేడాది డిసెంబరులో ఈ సామగ్రిని దిగుమతి చేసుకున్నారు. 

రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలకు గవర్నర్ చేతుల మీదుగా వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరుకు తీసుకురావడానికి, ఇక్కడ గోదాములో భద్రపరిచేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం వల్లే పంపిణీ ఆలస్యమైందని రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అగ్ని ప్రమాదంలో సామగ్రి కాలి బూడిదైన విషయాన్ని తానా దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కాగా, ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


More Telugu News