ఉక్రెయిన్ లో 20 శాతం రష్యా పరం - యుద్ధ వినాశనానికి సాక్ష్యాలు ఇవే..!

  • రెండు దేశాలదీ మొండి వైఖరే
  • శాంతి దిశగా పడని అడుగులు
  • సుదీర్ఘ యుద్ధంతో భారీ ఆర్థిక, ప్రాణ నష్టం
  • ముగింపు ఎలా ఉంటుందన్నదే తెలియని పరిస్థితి
ఉక్రెయిన్ -  రష్యా మధ్య యుద్ధం 100 రోజులకు చేరింది. ఉక్రెయిన్ లో 20 శాతం భూభాగం రష్యా అధీనంలోకి వెళ్లినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్వయంగా ప్రకటించారు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆరంభించడం తెలిసిందే. డాన్ బాస్ లో 30 శాతం రష్యా నియంత్రణలోకి వెళ్లింది. డోనెస్క్, మారిపోల్, లుహాన్క్స్ కూడా డాన్ బాస్ రీజియన్ లో భాగమే. రష్యా వాదన ప్రకారం డాన్ బాస్ లో 95 శాతం ఆ దేశం పరం అయింది. ఇక సెవెరో డోనెస్క్ కోసం రెండు దేశాల సైన్యం హోరాహోరీగా తలపడుతున్నాయి.

ఈ యుద్దంలో ఇరు దేశాల సైన్యానికి, పౌరులకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. రెండు దేశాలు వాస్తవ గణాంకాలను వెల్లడించడం లేదు. మృతుల సంఖ్య వేలల్లో ఉండొచ్చని తెలుస్తోంది. కానీ, కంటికి కనిపిస్తున్నది మాత్రం ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లో కుప్పకూలిన, అగ్ని కీలలకు మాడి మసైపోయిన బిల్డింగ్ లు, వాహనాలు! ఇక్కడి ఫొటోలు చూస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్ తదితర ప్రాంతాల్లో నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

చర్చలతో సమస్య పరిష్కారానికి రెండు దేశాల అధ్యక్షులు మెట్టు దిగిరావడం లేదు. జెలెన్ స్కీ పాశ్చాత్య దేశాల మద్దతుతో తాడో, పేడో తేల్చుకోవాలన్న పట్టుదలనే ప్రదర్శిస్తున్నారు. అంతేకానీ, రష్యాతో శాంతికి మొగ్గు చూపించడం లేదు. తాను పెట్టిన డిమాండ్లను పట్టించుకోకపోవడంతోనే రష్యా యుద్ధానికి దిగడం తెలిసిందే. 

ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ ఇప్పట్లో కోలుకోలేనంతగా దెబ్బతింది. అటు రష్యా ఆర్థిక వ్యవస్థ సైతం అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో కునారిల్లుతోంది. చివరికి దీనికి ముగింపు ఎప్పుడు.. ఎలా? అన్నది అర్థం కాకుండా ఉంది. కానీ, యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగితే ఉక్రెయిన్, రష్యా ఆర్థికంగా కుదురుకునేందుకు దశాబ్దం పట్టొచ్చు. ముఖ్యంగా అమెరికా తదితర దేశాల అండతో రష్యాకు ఎదురొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్.. చివరికి ఆయా దేశాల ఆర్థిక సాయంతోనే పైకి లేవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. 




 



More Telugu News