కేంద్ర మంత్రి షెకావ‌త్‌తో జ‌గ‌న్ భేటీ... రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు అమిత్ షాతో స‌మావేశం

  • ఢిల్లీ టూర్‌లో బిజీబిజీగా జ‌గ‌న్‌
  • కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి షెకావ‌త్‌తో స‌మావేశం
  • పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌పై చ‌ర్చ‌
  • నేడు అమిత్ షాతో భేటీ కాలేక‌పోయిన జ‌గ‌న్‌
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న డిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలి రోజైన గురువారం బిజీబిజీగా గ‌డిపారు. గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయ‌న సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత 5.30 గంట‌లకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో ఆయ‌న భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. 

తాజాగా రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా పోల‌వ‌రం స‌వ‌రించిన అంచనాల‌కు ఆమోదం తెల‌పాలంటూ ఆయ‌న కేంద్ర మంత్రిని కోరారు.

ఇదిలా ఉంటే... కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ‌న్ భేటీ కానున్నారు. ఢిల్లీ బ‌య‌లుదేరే స‌మ‌యానికి అమిత్ షా నుంచి ఎలాంటి అపాయింట్ మెంట్ ద‌క్కకున్నా... అమిత్ షాను క‌లిసి తీరాల‌న్న దిశ‌గా జ‌గ‌న్ సాగారు. 

ఈ క్ర‌మంలో గురువారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో అమిత్ షాతో జ‌గ‌న్ భేటీ అవుతార‌న్న వార్త‌లు వినిపించాయి. అయితే గురువారం జ‌గ‌న్‌తో భేటీకి అమిత్ షా స‌మ‌యం కేటాయించ‌లేద‌ని స‌మాచారం. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు జ‌గ‌న్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇచ్చిన‌ట్లుగా ఏపీ అధికారులు చెబుతున్నారు.


More Telugu News