తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోంది: అమిత్ షా

  • తమకు తెలంగాణ‌పై ఎలాంటి వివ‌క్ష లేదన్న అమిత్ షా 
  • ఏ ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వ‌చ్చినా గౌర‌విస్తామని స్పష్టీకరణ 
  • 2004 నుంచి 2014 వ‌ర‌కు తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ ప‌ట్టించుకోలేదని ఆరోపణ 
  • అన్ని రాష్ట్రాల అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్న కేంద్ర మంత్రి 
తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సాగిన ఉద్య‌మం, తెలంగాణ ప‌ట్ల కేంద్రం వైఖ‌రి, రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మార‌బోతోందని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ స‌మావేశంలో అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్య‌మం జ‌రిగిందన్నారు. 2004 నుంచి 2014 వ‌ర‌కు తెలంగాణ డిమాండ్‌ను కాంగ్రెస్ ప‌ట్టించుకోలేదని ఆయ‌న విమ‌ర్శించారు. 2014 ఎన్నిక‌ల కోస‌మే తెలంగాణ‌ను హ‌డావిడిగా ప్ర‌క‌టించారని ఆరోపించారు. 

అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మోదీ స‌ర్కారు క‌ట్టుబ‌డి ఉందన్న అమిత్ షా...తెలంగాణ‌పై ఏనాడూ స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపించ‌లేదన్నారు. త‌మ‌కు తెలంగాణ‌పై ఎలాంటి వివ‌క్ష లేదన్న ఆయ‌న ఏ ముఖ్య‌మంత్రి ఢిల్లీకి వ‌చ్చినా గౌర‌విస్తామ‌ని తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం పురోగ‌మిస్తుంద‌ని తాము న‌మ్ముతామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

అతి త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో ప్ర‌భుత్వం మార‌బోతోందని అమిత్ షా చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం స్థానంలో బీజేపీ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ విమోచ‌న దినాన్ని అధికారికంగా నిర్వ‌హిస్తామ‌ని అమిత్ షా ప్ర‌క‌టించారు.


More Telugu News