సోనియా గాంధీ గారు త్వరగా కోలుకోవాలి: ప్రధాని మోదీ

  • సోనియా గాంధీకి కరోనా పాజిటివ్
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి
  • సోనియా ఐసోలేషన్ లో ఉన్నారన్న సూర్జేవాలా
  • సోనియా కోలుకుంటున్నారని వెల్లడి
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరోనా బారినపడడం తెలిసిందే. కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో ఆమె ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. సోనియాకు కరోనా సోకడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కొవిడ్-19 నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

కాగా, సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. సోనియాకు అవసరమైన వైద్య సాయం అందుతోందని, కరోనా నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. ఇటీవల కొన్నిరోజులుగా సోనియా విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సోనియాను కలిసిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వున్నట్టు వెల్లడైంది. అలా ఆమెకు వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

మరోపక్క, సోనియా ఈ నెల 8న నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నప్పటికీ, కోలుకుని విచారణకు హాజరవ్వాలని సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News