ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో టీడీపీ పోటీలో లేదు: చంద్ర‌బాబు

  • మ‌ర‌ణించిన నేత కుటుంబీకుల ఎన్నిక‌కు టీడీపీ క‌ట్టుబడి ఉందన్న చంద్రబాబు 
  • బ‌ద్వేల్‌లో కూడా ఆ కార‌ణంగానే పోటీ చేయ‌లేదని వివరణ 
  • ఆత్మ‌కూరులో కూడా ఈ సంప్ర‌దాయం మేర‌కు పోటీకి దూరమని వెల్లడి 
  • ఉప ఎన్నిక‌ల‌పై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయ‌న్న చంద్రబాబు
నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీకి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో టీడీపీ వైఖరిపై ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కాసేప‌టి క్రితం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ పోటీలో లేద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

 ప‌ద‌విలో ఉన్న నేత చ‌నిపోయిన కార‌ణంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌న్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. దీనికి త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఈ సంప్ర‌దాయాన్ని గౌర‌వించి దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణం నేప‌థ్యంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో టీడీపీ పోటీ చేయ‌రాద‌ని నిర్ణ‌యించామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో టీడీపీ ఎందుకు పోటీ చేయ‌లేదో.. అదే కార‌ణంతోనే ఆత్మ‌కూరులోనూ పోటీ చేయ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఉప ఎన్నిక‌ల‌పై వైసీపీ స‌వాళ్లు నీచంగా ఉన్నాయ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. చ‌నిపోయిన నేత కుటుంబ స‌భ్యుల‌కే టికెట్ ఇస్తే.. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఏనాడూ పోటీ చేయ‌ద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.


More Telugu News