దళితబంధు ఒక గొప్ప సామాజిక ఉద్యమం: కేసీఆర్

  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంట్ కష్టాలకు ముగింపు పలికామన్న సీఎం  
  • మిషన్ భగీరథ వల్ల ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందుతోందని వెల్లడి 
  • ఇప్పటి వరకు 2.91 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామన్న కేసీఆర్ 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు ముగింపు పలికామని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ఈరోజు ఇళ్లకు, అన్ని రంగాలకు నిరంతరాయంగా, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. 2014లో రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగిందని చెప్పారు. 

తాగునీటి సమస్యను పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టామని.. దీని వల్ల ఈరోజు రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా అవుతోందని కేసీఆర్ చెప్పారు. ఈ పథకానికి నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా వచ్చిందని తెలిపారు. 

మిషన్ కాకతీయతో పెద్ద ఎత్తున చెరువులను పునరుద్ధరించుకున్నామని కేసీఆర్ చెప్పారు. 15 లక్షలకు పైగా ఎకరాల సాగు భూమిని స్థిరీకరించుకున్నామని తెలిపారు. చెరువుల్లో నీటీ సామర్థ్యం పెరిగిందని చెప్పారు. చెరువులన్నింటినీ సాగునీటి ప్రాజెక్టుల కాలువలతో అనుసంధానం చేశామని... తద్వారా నిండు వేసవిలో కూడా చెరువులు జలకళను సంతరించుకున్నాయని తెలిపారు. 

ఇక దళితబంధు ఒక గొప్ప సామాజిక ఉద్యమమని కేసీఆర్ చెప్పారు. అణగారిన దళిత జాతి అభ్యున్నతికి పాటుపడటమే ధ్యేయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో లబ్ధిదారుడు స్వేచ్ఛగా తనకు వచ్చిన పనిని ఎంచుకోవచ్చని చెప్పారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన వైన్ షాపుల్లో 261 షాపులను దళితులకు కేటాయించామని తెలిపారు. ఇప్పటి వరకు 2.91 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. సొంత స్థలం కలిగిన వారికి దశలవారీగా రూ. 3 లక్షలు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.


More Telugu News