ఇది కదా ప్రేమంటే! పులులుండే అడవిని దాటి, సముద్రాన్ని ఈది.. ప్రియుడి కోసం ప్రియురాలి సాహసం!

  • ఫేస్‌బుక్ ద్వారా కోల్‌కతా యువకుడితో బంగ్లాదేశ్ అమ్మాయికి పరిచయం
  • ప్రేమగా మారడంతో పెళ్లాడేందుకు సాహసం
  • సుందర్‌బన్ అడవిని దాటి, గంటపాటు సముద్రం ఈది భారత్‌లోకి ప్రవేశం
  • కోల్‌కతాలోని కాళీమాత ఆలయంలో ప్రియుడితో పెళ్లి
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రేమ.. ఇదో మధురమైన భావన. ప్రేమ కోసం రాజ్యాలు కోల్పోయిన వారు.. ప్రేమ కోసం యుద్ధాలు చేసిన వారు చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారు. కల్మషం లేని నిండైన ప్రేమ మనిషితో ఎంత పనైనా చేయిస్తుంది. ప్రపంచానికి ఉన్న అడ్డుగోడలు తుడిపేస్తుంది. జాతి, కులమత భేదాలు ప్రేమ ముందు బలాదూర్. 

ఈ విషయాన్ని మరోమారు నిరూపించింది బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్. ఆమె చేసిన సాహసం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పక మానరు. ఇది కూడా ఫేస్‌బుక్ ప్రేమే అయినా ప్రియుడితో కలిసి ఏడడుగులు నడిచేందుకు ఆమె పడిన తపన, చేసిన సాహసం మాత్రం ఔరా అనిపిస్తాయి.

కోల్‌కతాకు చెందిన అభిక్ మండల్ అనే యువకుడితో బంగ్లాదేశ్‌కు చెందిన కృష్ణ మండల్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది మరింత ముదిరి ప్రేమగా మారింది. ఫేస్‌బుక్ వేదికగా వారిద్దరూ ఎన్నో ఊసులు చెప్పుకున్నారు. పెళ్లి చేసుకుని ప్రేమను పరిపూర్ణం చేసుకోవాలనుకున్నారు. భారత్ వచ్చి అతడితో మూడుముళ్లు వేయించుకోవాలని, ఏడడుగులు నడవాలని ఆమె తలపోసింది. కోల్‌కతాలోని ప్రియుడిని ఎలాగైనా కలుసుకోవాలని నిర్ణయించుకుంది.

అనుకున్నదే తడవుగా ప్రాణాలను పణంగా పెట్టి రాయల్ బెంగాల్ పులులు తిరుగాడే సుందర్‌బన్ అడవిలోకి ప్రవేశించింది. నడుస్తూ అడవిని దాటేసింది. ఆ తర్వాత సముద్రంలోకి దూకి గంటపాటు ఈదుకుంటూ పశ్చిమ బెంగాల్‌ భూభాగంపై అడుగుపెట్టింది. మూడు రోజుల క్రితం కోల్‌కతాలోని కాళీమాత ఆలయంలో ప్రియుడు అభిక్ మండల్‌తో మూడుముళ్లు వేయించుకుంది. 

అయితే, ఇక్కడితో వీరి ప్రేమ కథకు ఫుల్‌స్టాప్ పడలేదు. అప్పుడే అసలు కథ మొదలైంది. కృష్ణ మండల్ సాహసగాథ ఆ నోటా ఈ నోటా పాకి.. చివరికి పోలీసులకు చేరింది. దీంతో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిందంటూ ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బంగ్లాదేశ్ రాయబార కార్యాలయానికి అప్పగించాలని నిర్ణయించారు.

గతేడాది కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పశ్చిమ బెంగాల్‌ నాడియాలోని బల్లవ్‌పూర్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు.. బంగ్లాదేశ్‌లోని నెరైల్‌కు చెందిన తన 18 ఏళ్ల ప్రియురాలిని కలుసుకునేందుకు బయలుదేరాడు. చివరికి ఎలాగోలా ఆమెను కలుసుకున్నాడు. ఇద్దరూ తిరిగి వస్తుండగా పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ అధికారులు ఈ జంటను అరెస్ట్ చేశారు. వీరిద్దరికి కూడా ఆన్‌లైన్‌లోనే పరిచయం అయింది. 

ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్ కుర్రాడు ఇమాన్ హొసైన్ భారత్‌లో దొరికే తనకు ఇష్టమైన చాక్లెట్లు కొనుక్కునేందుకు నదిని ఈదుతూ పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించి వాటిని కొనుక్కుని తిరిగి వెళ్లేవాడు. చివరికి ఓ రోజు అతడు పోలీసులకు చిక్కాడు. కోర్టు అదేశాలతో బాలుడిని 15 రోజుల జుడీషియల్ రిమాండుకు తరలించారు.


More Telugu News