పాలిటిక్స్‌లోకి గంగూలీ ఎంట్రీ ప‌క్కా!... ఈ ట్వీటే సాక్ష్యమంటూ క‌థ‌నాలు!

  • మ‌రింత మంది ప్ర‌జ‌ల‌కు సేవ కోసం కొత్త ప్ర‌యాణం
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా గంగూలీ ఆస‌క్తిక‌ర పోస్ట్‌
  • ఇటీవ‌లే అమిత్ షాతో రెండు సార్లు భేటీ
  • పొలిటిక‌ల్ ఎంట్రీకి గంగూలీ సిద్ధ‌మ‌య్యారంటూ క‌థ‌నాలు
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించడం ఖాయ‌మేన‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వర‌లోనే బీసీసీఐ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న గంగూలీ... ఆ వెంట‌నే బీజేపీలో చేర‌తారంటూ పుకార్లు జోరందుకున్నాయి. ఈ వార్త‌లు నిజ‌మేన‌న్న కోణంలో బుధ‌వారం సాయంత్రం త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో గంగూలీ ఓ ఆస‌క్తిక‌ర ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

క్రికెట్‌లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు అయ్యింద‌ని పేర్కొంటూ, ఈ సుదీర్ఘ కెరీర్‌లో త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారికి గంగూలీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతేకాకుండా మ‌రింత మంది ప్ర‌జ‌ల‌కు సేవ చేసే దిశ‌గా త్వర‌లోనే ఓ కొత్త నిర్ణ‌యం తీసుకోబోతున్నాన‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. 
ఇదిలా ఉంటే.. బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షాతో ఇటీవ‌లి కాలంలో మ‌రింత‌గా స‌న్నిహితంగా మెల‌గుతున్న గంగూలీ... నెల వ్య‌వ‌ధిలోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రెండు ప‌ర్యాయాలు భేటీ అయ్యారు. గ‌త నెల 7న కోల్ క‌తా వెళ్లిన అమిత్ షా... గంగూలీ ఇంటికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా గంగూలీ ఇంటిలోనే అమిత్ షా భోజ‌నం చేశారు.

ఆ త‌ర్వాత ఇటీవ‌లే మ‌రోమారు అమిత్ షాను గంగూలీ క‌లిశార‌ట‌. ఇలా అమిత్ షాతో రెండు సార్లు భేటీ కావ‌డం, తాజాగా మ‌రింత మంది ప్ర‌జ‌ల‌కు సేవ చేసే దిశ‌గా కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్ట‌నున్నాన‌ని స్వ‌యంగా గంగూలీనే ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఖాయ‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.


More Telugu News