చార్మినార్ లో ముస్లింల ప్రార్థనలను అనుమతించాలి.. స్థానిక కాంగ్రెస్ నేత డిమాండ్

  • రెండు దశాబ్దాల క్రితం ముస్లింలు ప్రార్థనలు చేసుకునేవారన్న రషీద్ ఖాన్ 
  • తమ డిమాండ్లతో ముఖ్యమంత్రిని కలుస్తామని వెల్లడి 
  • పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముందు ధర్మా చేపడతామని హెచ్చరిక  
ప్రముఖ ప్రాచీన కట్టడమైన చార్మినార్ ను ముస్లింల ప్రార్థనలకు అనుమతించాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్య ప్రాంతాల్లో ఆలయం-మసీదు వివాదం నెలకొన్న నేపథ్యంలో చార్మినార్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుండడం గమనార్హం. 16వ శతాబ్దపు కట్టడమైన చార్మినార్ వద్ద ముస్లింలు లోగడ ప్రార్థనలు చేసుకునే వారని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. రెండు దశాబ్దాల క్రితం ముస్లింలను ప్రార్థనలు చేసుకోకుండా నిలిపివేసినట్టు ఓ వార్తా ఏజెన్సీకి చెప్పారు. 

చార్మినార్ లో ప్రార్థనలను అనుమతించాలని కోరుతూ ఆయన సంతకాల ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురాతత్వ పరిశోధన విభాగాన్ని (ఏఎస్ఐ) కూడా ఆయన ఇదే కోరారు. తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడగా.. శాంతి భద్రతల సమస్యను ఆయన ప్రస్తావించినట్టు చెప్పారు. అందరి నుంచి సంతకాలు తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని ప్రకటించారు. 

తమ అభ్యర్థనలను పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. చార్మినార్ ను ఆనుకునే ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంపైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్రమించి కట్టిన చట్ట విరుద్ధమైన కట్టడంగా దానిని పేర్కొన్నారు. ఆలయంలో ప్రార్థనలకు అనుమతించినప్పుడు.. చార్మినార్ ను సైతం ముస్లింల ప్రార్థనలకు అనుమతించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.


More Telugu News