తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్ బాగోలేదు.. ఒక చెత్త ఐటీ పార్క్ మాదిరి ఉంది.. మార్చేయండి: రైల్వే మంత్రికి దర్శకుడు నాగ్ అశ్విన్ విన్నపం

  • తిరుపతి రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్న రైల్వే శాఖ
  • రైల్వే స్టేషన్ డిజైన్ పై వెల్లువెత్తుతున్న అసంతృప్తి
  • డిజైన్ లో ఆధ్యాత్మికత కనిపించడం లేదని విమర్శలు
తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటుంది. ఈ రద్దీని తట్టుకునేలా తిరుపతి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతోంది.

ఈ క్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ నూతన డిజైన్ ఫొటోలను రైల్వే శాఖ నిన్న విడుదల చేసింది. ఈ ఫొటోలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పనులకు సంబంధించి కాంట్రాక్టులను కూడా ఇచ్చేశామని... త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 

అయితే, రైల్వే శాఖ విడుదల చేసిన డిజైన్లపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. భవనం డిజైన్ సాదాసీదాగా ఉందని, ఒక ఐటీ కార్యాలయం భవనం మాదిరి ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవనం డిజైన్ మన సంస్కృతికి దగ్గరగా లేదని, పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదని విమర్శిస్తున్నారు. తిరుమల, తిరుపతి ఆధ్యాత్మికత డిజైన్ లో కనిపించడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 'డియర్ సర్. రైల్వే స్టేషన్ డిజైన్ ను ఎవరూ ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి వస్తున్న కామెంట్లను మీరు కూడా చూసే ఉంటారు. వెస్టర్న్ డిజైన్ ను కాపీ చేసినట్టుగా, ఒక చెత్త ఐటీ పార్క్ మాదిరిగా ఉంది. తిరుపతి చాలా పవిత్రమైనది, ఆధ్యాత్మికతతో కూడినది. అత్యున్నతమైనటువంటి మన భారతీయ ఆర్కిటెక్చర్ పై పట్టున్న వ్యక్తుల చేత డిజైన్ చేయించండి. గ్లాస్, స్టీల్ తో కూడిన భవనాలను కాపీ కొట్టొద్దు' అని రైల్వే మంత్రికి సూచించారు.



More Telugu News