గోవా నుంచి ఏపీకి డ్రగ్స్ తరలిస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుబడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు

  • వర్క్ ఫ్రం హోం చేస్తున్న నిందితులు
  • గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు
  • పెద్ద అంబర్‌పేట వద్ద లారీ ఎక్కిన వీరిని పట్టుకున్న పోలీసులు
  • రూ. 2.35 లక్షల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం
గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్యసంపత్, రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీంద్ర సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. వీరిద్దరూ గత కొంతకాలంగా రాజమహేంద్రవరం నుంచి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు.

ఈ నెల 25న గోవాలో ఓ వ్యక్తి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ (25 మాత్రలు), ఎల్‌ఎస్‌డీ (2 స్ట్రిప్పులు) కొనుగోలు చేసి బస్సులో హైదరాబాద్ చేరుకున్నారు.  పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగురోడ్డు వద్ద లారీ ఎక్కి రాజమహేంద్రవరం బయలుదేరారు. 

వీరిద్దరి వద్ద డ్రగ్స్ ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ నెల 28న మధ్యాహ్నం చౌటుప్పల్ బస్టాండ్ వద్ద లారీ ఆపి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి డ్రగ్స్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 2.35 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం రాత్రి వీరిని చౌటుప్పల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆయన ఆదేశాలతో నల్గొండ జైలుకు తరలించారు.


More Telugu News