ఈ చిన్నారి కులమతాలకు అతీతురాలు.. తమిళనాడులో తొలి 'కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం' జారీ!

  • దరఖాస్తు ఫామ్‌లో కుల, మత కాలమ్‌ను నింపకుంటే సీటు ఇవ్వబోమన్న పాఠశాల యాజమాన్యాలు
  • అన్ని చోట్లా అదే సమాధానం రావడంతో కలెక్టర్‌ను ఆశ్రయించిన జంట
  • అఫిడవిట్ ఇవ్వడంతో సర్టిఫికెట్ జారీ చేసిన తహసీల్దార్
  • కుల, మతం కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టొచ్చని ఎప్పుడో చెప్పిన ప్రభుత్వం
  • అయినా పట్టించుకోని విద్యాసంస్థలు
తమిళనాడుకు చెందిన ఓ జంట తమ మూడున్నరేళ్ల చిన్నారికి ‘కుల, మత రహిత ధ్రువీకరణ పత్రం’ పొందింది. ఫలితంగా ఆ చిన్నారి ఏ కులానికి, మతానికి చెందిన వ్యక్తి కానట్టే. తమ కుమార్తె విల్మను కిండర్‌గార్టెన్‌లో చేర్పించాలని నిర్ణయించిన ఆమె తల్లిదండ్రులు నరేష్ కార్తీక్-గాయత్రి దంపతులు ఓ స్కూలుకు వెళ్లారు. దరఖాస్తు ఫామ్‌లో కులం, మతం కాలమ్‌ను ఖాళీగా వదిలేస్తే.. సీటు ఇవ్వబోమని చెప్పుకొచ్చారు. దీంతో మరికొన్ని స్కూళ్లకు వెళ్లగా అక్కడ కూడా వారికి అదే అనుభవం ఎదురైంది. 

సీడ్‌రీప్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడైన నరేష్ మాట్లాడుతూ.. కులమతాల పేరుతో తమ కుమార్తెను నిర్బంధించడం ఇష్టం లేకే ఆమె పేరున కుల, మత రహిత (No Religion-No Caste) సర్టిఫికెట్ తీసుకున్నట్టు చెప్పారు. తమ కుమార్తెకు దేవుడంటే ప్రేమ అని, ప్రేమ అంటే సమానత్వమని అన్నారు. విద్యాసంస్థలన్నీ విద్యార్థులకు ఇదే విషయాన్ని నేర్పాలని ఆయన కోరారు. 

విల్మను స్కూల్‌లో చేర్పించేందుకు వెళ్లిన స్కూళ్లలోని దరఖాస్తు ఫామ్‌లో ‘నో క్యాస్ట్, నో రిలిజియన్’ అనే కాలమ్ లేదన్నారు. ఈ రెండింటిని నింపకుండా జాయిన్ చేసుకోబోమని తమతో చెప్పారని అన్నారు. అయితే, నిజానికి 1973లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే సమయంలో మతం, కులం తప్పనిసరి కాదు. అయితే, ఈ విషయం ఈ జంటకు తెలియదు. పాఠశాలలు కూడా ఈ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తున్నాయి.

1973, 2000వ సంవత్సరంలో తమిళనాడు విద్యా శాఖ రెండు వేర్వేరు ఉత్తర్వులు విడుదల చేసింది. అందులోనూ ఇదే విషయాన్ని పేర్కొంది. ‘కులం లేదు, మతం లేదు’ అని తల్లిదండ్రులు చెబితే కనుక ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలిపెట్టేందుకు ప్రజలను అనుమతించాలంటూ పాఠశాల విద్యా డైరెక్టర్‌ను ఆదేశించింది.  

అయితే, మతం, కులం కాలాన్ని నింపకుండా స్కూల్‌లో చేర్చుకోబోమని స్కూళ్లు తేల్చి చెప్పడంతో నరేష్ దంపతులు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరన్‌ను సంప్రదించడంతో సమస్య పరిష్కారమైంది. చిన్నారి తల్లిదండ్రులు అఫిడవిట్ సమర్పించడంతో కోయంబత్తూరు నార్త్ తహసీల్దార్ వారికి ‘నో రిలిజియన్-నో క్యాస్ట్’ సర్టిఫికెట్ జారీ చేశారు. తమిళనాడులో జారీ అయిన తొలి కుల, మత రహిత సర్టిఫికెట్ ఇదే. కాగా, కుల, మత రహిత సర్టిఫికెట్ వల్ల ప్రభుత్వ రిజర్వేషన్లకు, ప్రత్యేకాధికారాలకు తమ కుమార్తె అనర్హురాలిగా మారుతుందని తమకు తెలుసని ఆ అఫిడవిట్‌లో వారు పేర్కొన్నారు. 

తహసీల్దార్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం ప్రకారం.. బేబీ విల్మ ఏ కులానికి, మతానికి చెందినది కాదు. 'మతం లేదు, కులం లేదు' అనే సర్టిఫికేట్‌ను పొందొచ్చన్న విషయం చాలామంది తల్లిదండ్రులకు తెలియదని, ఇలాంటి ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు మరింత మంది తల్లిదండ్రులు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్టు నరేష్ చెప్పారు.


More Telugu News