మోదీ ప్ర‌శంసించిన రాంభూపాల్ రెడ్డి ఈయ‌నే!... బాలికల కోసం ఈయ‌న‌ ఏం చేస్తున్నారంటే..!

  • పెన్ష‌న్ సొమ్ము రూ.25 ల‌క్ష‌లు పోస్టాఫీస్‌లో పిక్స్‌డ్ డిపాజిట్‌
  • దానిపై వ‌చ్చే వ‌డ్డీని బాలికల ఖాతాల‌కు మ‌ళ్లిస్తున్న రిటైర్ట్ టీచ‌ర్‌
  • రాం భూపాల్ రెడ్డిని అభినందిస్తూ వైవీ సుబ్బారెడ్డి ట్వీట్‌
ఆదివారం నాటి మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు రాంభూపాల్ రెడ్దిపై టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సోమ‌వారం నాడు ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన రాం భూపాల్ రెడ్డి 88 మంది బాలికల ఆర్థిక సంరక్షణ కోసం సుకన్య బాలిక సమృద్ధి పథకం ఖాతాలు తెరిపించారంటూ మోదీ ప్ర‌స్తావించిన సంగ‌తి తెలిసిందే. 

ఆ 88 మంది బాలిక‌ల ఆర్థిక ర‌క్ష‌ణ కోసం రాం భూపాల్ రెడ్డి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టార‌న్న విష‌యాన్ని పూర్తి వివ‌రాల‌తో వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. త‌న‌కు వ‌చ్చిన పెన్ష‌న్ సొమ్ము రూ.25 ల‌క్ష‌ల‌ను పోస్టాఫీస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రాంభూపాల్ రెడ్డి దానిపై వ‌చ్చే వ‌డ్డీని బాలిక‌ల ఖాతాల‌కు విరాళంగా ఇస్తున్నార‌ని ఆయన తెలిపారు. ఇంత మంచి ప‌ని చేస్తున్న రాం భూపాల్ రెడ్డిని ప్ర‌ధాని ప్ర‌శంసించ‌డం సంతోష‌మ‌ని పేర్కొన్న వైవీ సుబ్బారెడ్డి.. రాం భూపాల్ రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు. త‌న ట్వీట్‌కు రాం భూపాల్ రెడ్ది ఫొటోను కూడా వైవీ సుబ్బారెడ్డి జ‌త చేశారు.


More Telugu News