ముగిసిన విదేశీ పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

  • 12 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న కేటీఆర్
  • తొలుత లండన్‌ వెళ్లిన మంత్రి
  • 23న దావోస్‌ చేరుకున్న కేటీఆర్
  • 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమావేశం
  • రాష్ట్రానికి రూ. 4,200 కోట్ల పెట్టుడులు
తెలంగాణ మంత్రి కేటీఆర్ తన 12 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 18న తొలుత లండన్ వెళ్లిన ఆయన బ్రిటన్, భారత్ వాణిజ్య మండలి రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. అలాగే, భారత రాయబారి ఏర్పాటు చేసిన వాణిజ్యవేత్తలు, ప్రవాసుల భేటీలోనూ పాల్గొన్నారు. దావోస్ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు 22న లండన్ నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 

23న దావోస్‌ సదస్సుకు హాజరయ్యారు. 28 వరకు జరిగిన ఈ సదస్సులో భాగంగా కేటీఆర్ తెలంగాణ పెవిలియన్‌లో 45 మంది పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపు రూ. 4,200 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సాధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలతోపాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు.


More Telugu News