అనుచిత వ్యాఖ్యల వివాదం.. సుప్రియా సూలేకు క్షమాపణ చెప్పిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్

  • సుప్రియా సూలేను ఇంటికెళ్లి వంట చేసుకోమన్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్
  • దేశవ్యాప్తంగా నిరసనల వెల్లువ
  • నోటీసులు పంపిన రాష్ట్ర మహిళా కమిషన్
  • క్షమాపణలు చెప్పడంతో ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలన్న సుప్రియ
‘నీకు రాజకీయాలు ఎందుకు? ఇంటికెళ్లి వంట చేసుకో’ అంటూ ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ క్షమాపణలు చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు పంపింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పినట్టు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వెల్లడించారు. 

సుప్రియా సూలేపై చేసిన వ్యాఖ్యలపై చంద్రకాంత్ పాటిల్‌కు కమిషన్ నుంచి నోటీసులు పంపినట్టు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలి చంకాంకర్ తెలిపారు. ఈ నోటీసులకు ఆయన బదులిస్తూ క్షమాపణలు కోరినట్టు చెప్పారు. రాజకీయాల్లో ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదన్న అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయన తన వివరణలో పేర్కొన్నట్టు రూపాలి తెలిపారు.

క్షమాపణల విషయమై సుప్రియా సూలే స్పందిస్తూ.. క్షమాపణ చెప్పడం ద్వారా చంద్రకాంత్ పాటిల్ తన విశాల హృదయాన్ని చూపించారని, కాబట్టి  ప్రతి ఒక్కరు ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.


More Telugu News