తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు సచిన్ అమూల్యమైన సలహా.. పొగడ్తల వర్షం

  • తిలక్ బౌలింగ్ కూడా చేస్తాడని వెల్లడి
  • ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని మరువొద్దని సూచన
  • తిలక్ ఆట చూసి ముచ్చటపడ్డానన్న సచిన్
ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర వైఫల్యాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. హేమాహేమీలు విఫలమైన చోట తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మెరిశాడు. జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై టీమిండియా, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా సచిన్ టెండూల్కర్ కూడా అతడిపై పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేకాదు.. అమూల్యమైన సలహానూ ఇచ్చాడు. తన యూట్యూబ్ చానెల్ లో తిలక్ వర్మ గురించి మాట్లాడాడు. 

తిలక్ వర్మ నమ్మదగిన క్రికెటర్ అని సచిన్ అన్నాడు. ‘‘ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో తిలక్ ను కలిశాను. అతడితో మాట్లాడాను. అతడి బ్యాటింగ్ పై సాధన చేశాం. అతనొక పాజిటివ్ ఆటగాడు. క్లియర్ గా.. సింపుల్ గా ఉండే మనస్తత్వం. ముంబై ఇండియన్స్ కు ట్రయల్ గేమ్స్ ఆడేటప్పుడు తిలక్ ఆటచూసి ముచ్చటపడిపోయా’’ అని పేర్కొన్నాడు. 

తిలక్ వర్మ ఒక్క బ్యాటరే కాదని, ఆఫ్ స్పిన్నర్ కూడా అని ఎవరికీ తెలియని విషయాన్ని సచిన్ వెల్లడించాడు. అయితే, ఈ సీజన్ లో అతడు కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడని చెప్పాడు. అతడు చాలా ఫిట్ గా ఉన్నాడని, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తగలడని పేర్కొన్నాడు. పొట్టి ఫార్మాట్ లో తిలక్ ఒకట్రెండు ఓవర్లు వేయగలడన్న సచిన్.. బౌలింగ్ ను మాత్రం అస్సలు మరచిపోవద్దంటూ తిలక్ కు సూచించాడు. తిలక్ కు బ్రహ్మాండమైన భవిష్యత్ ఎదురుచూస్తోందని చెప్పుకొచ్చాడు.


More Telugu News