పోడు భూముల్లో హ‌రిత హారం నిలిపేయండి: కేసీఆర్‌కు బండి సంజ‌య్ లేఖ

  • పోడు భూముల ప‌ట్టాల కోసం 3.5 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు
  • త‌క్ష‌ణ‌మే వారికి ప‌ట్టాలు ఇవ్వాలి
  • ఇత‌రత్రా భూముల‌ను వ‌దిలేసి పోడు భూముల్లోనే హ‌రిత హారం ఎందుకు?
  • ఇది గిరిజ‌నుల‌ను న‌య‌వంచ‌న‌కు గురి చేయ‌డ‌మేన‌న్న సంజ‌య్‌
తెలంగాణ‌లో పోడు భూముల వ్య‌వ‌హారానికి సంబంధించి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆదివారం ఓ బ‌హిరంగ లేఖ రాశారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజ‌నుల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని బండి సంజ‌య్ ఆ లేఖ‌లో కోరారు. అదే స‌మ‌యంలో పోడు భూముల్లో చేప‌డుతున్న హ‌రిత హారం ప‌నుల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అప‌రిష్కృతంగా ఉన్న పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కుండానే... ఆ భూముల్లో హ‌రిత హారం ప‌నులు చేప‌ట్ట‌డం గిరిజ‌నుల‌ను న‌య‌వంచ‌న‌కు గురి చేయ‌డ‌మేన‌ని ఆయ‌న ఆరోపించారు. 

హ‌రిత హారం కార్య‌క్రమానికి తాము వ్య‌తిరేకం కాద‌ని చెప్పిన బండి సంజ‌య్‌.. ఇత‌ర‌త్రా భూముల‌ను వ‌దిలేసి కేవ‌లం పోడు భూముల్లోనే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌డాన్నే తాము వ్య‌తిరేకిస్తున్నామ‌ని తెలిపారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న దాదాపు 3.5 ల‌క్ష‌ల మంది గిరిజ‌న రైతులు త‌మ‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని ఇప్ప‌టికే ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. ముందుగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న రైతుల‌కు త‌క్ష‌ణ‌మే పోడు భూముల‌కు ప‌ట్టాలు ఇవ్వాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


More Telugu News