అదనపు కట్నం కోసం డాక్టర్ వేధింపులు.. డాక్టర్ అయిన అతడి భార్య ఆత్మహత్య

  • గత ఏడాది డిసెంబర్ లో వారిద్దరికి వివాహం
  • ఆసుపత్రి కట్టేందుకు మరింత కట్నం తేవాలంటూ భర్త వేధింపులు
  • 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన భార్య
  • సర్ది చెప్పి తిప్పి పంపిన తల్లిదండ్రులు
  • శుక్రవారం రాత్రి ఫోన్ చేసినా ఎత్తని వైనం
అతడో వైద్యుడు.. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉన్నాడు. కానీ, వరకట్నం అనే మూఢాచారంతో అతడి కళ్లు మూసుకుపోయాయి. అదనపు కట్నం కోసం వేధించి డాక్టర్ అయిన తన భార్య చావుకు కారణమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... 

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నర్సాపూర్ కు చెందిన డాక్టర్ వంగ భారతి (31) గైనకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తుండేవారు. కరీంనగర్ జమ్మికుంటకు చెందిన పిల్లల నిపుణుడైన డాక్టర్ కనకట్ట రమేశ్ తో గత ఏడాది డిసెంబర్ 9న ఆమెకు వివాహం చేశారు. ఎకరం పొలం, రూ.5 లక్షలు, 20 తులాల బంగారం కట్నకానుకల కింద ఇచ్చారు. ఆ దంపతులు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు దగ్గర్లో సూర్యోదయనగర్ లో ఉంటున్నారు. 

అత్తాపూర్ లోని బటర్ ఫ్లై చిల్డ్రన్ ఆసుపత్రిలో ఆన్ కాల్ పై పనిచేస్తున్నారు. వారిద్దరి కాపురం కొన్నాళ్లు సవ్యంగానే సాగింది. అయితే, ఇటీవలి కాలంలో రమేశ్.. ఆసుపత్రి కడదామని చెబుతూ అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించసాగాడు. మద్యం తాగొచ్చి హింసించేవాడు. ఆ వేధింపులు భరించలేక 15 రోజుల క్రితం భారతి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు సర్దిచెప్పడంతో వారం క్రితం ఇంటికి వచ్చింది. 

అయితే, శుక్రవారం రాత్రి ఆమె ఎంతకీ ఫోన్ ఎత్తలేదు. శనివారం ఉదయం రమేశ్ కు భారతి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే.. తానింకా ఆసుపత్రిలోనే ఉన్నానని, వెళ్లి చూస్తానని చెప్పాడు. ఇంటికెళ్లి చూసే సరికి భారతి విగతజీవిగా కనిపించింది. దీంతో భారతి తల్లిదండ్రులకు అతడు సమాచారమిచ్చాడు. రమేశ్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని భారతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. విషం తాగి మరణించినట్టు అనుమానిస్తున్నారు.


More Telugu News