ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు: మంత్రి అంబ‌టి రాంబాబు

  • వంద మ‌హానాడులు జ‌రిపినా చంద్ర‌బాబు సీఎం కాలేరన్న అంబటి 
  • వ‌చ్చే ఐదేళ్లు కూడా చంద్ర‌బాబుకు నిద్ర‌ప‌ట్ట‌దని వ్యాఖ్య 
  • అది మ‌హానాడు కాదు.. మోస‌పు నాడు అంటూ విమర్శలు 
  • చంద్ర‌బాబు తప్పిదం వ‌ల్లే డయాఫ్ర‌మ్ వాల్ కూలిపోయింద‌న్న అంబ‌టి
టీడీపీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న మ‌హానాడుపై వైసీపీ కీల‌క నేత, ఏపీ జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జ‌రుగుతోంద‌న్న అంబ‌టి... అది మ‌హానాడు కాద‌ని, మోస‌పు నాడు అంటూ మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ఇళ్లు ద‌గ్ధ‌మైతే మ‌హానాడులో ఖండించారా? అని రాంబాబు ప్రశ్నించారు. సీఎం జ‌గ‌న్‌ను తిట్ట‌డమే త‌ప్పించి మ‌హానాడులో చేసిందేమీ లేద‌ని కూడా ఆయ‌న అన్నారు. 

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు‌పైనా అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబువి దుర్మార్గ‌మైన రాజ‌కీయాల‌ని, ఆయన ఓ విష స‌ర్ప‌మంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చంద్రబాబు ఏమీ చేయలేదని కూడా ఆయ‌న ఆరోపించారు. వంద మ‌హానాడులు చేసినా చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రాలేర‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. ఫ‌లితంగా వ‌చ్చే ఐదేళ్లు కూడా చంద్ర‌బాబుకు నిద్ర‌ప‌ట్ట‌ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ఇక పోలవ‌రం ప్రాజెక్టులో కూలిపోయిన డ‌యాఫ్ర‌మ్ వాల్‌ని అంబ‌టి ప్ర‌స్తావించారు. చంద్ర‌బాబు చేసిన చారిత్ర‌క త‌ప్పిదం వ‌ల్లే డయాఫ్ర‌మ్ వాల్ కూలిపోయింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కాఫ‌ర్ డ్యామ్ పూర్తి కాక‌ముందే డ‌యాఫ్ర‌మ్ వాల్ నిర్మించార‌న్న అంబ‌టి... ఈ కార‌ణంగానే డ‌యాఫ్ర‌మ్ వాల్ కూలిపోయింద‌ని తెలిపారు.


More Telugu News