డిజిటల్ చెల్లింపుల కాలంలోనూ రూ.100 నోటుకు అత్యధికుల ఓటు

  • వార్షిక నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ
  • అనేక ఆసక్తికర అంశాలతో నివేదిక
  • రూ.2 వేల నోటు జోలికి వెళ్లని జనాలు
  • అత్యంత చెలామణీలో ఉన్న నోటుగా రూ.500
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన వార్షిక నివేదికను విడుదల చేసింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ఈ నివేదికలో ఈ కేంద్ర బ్యాంకు అనేక ఆసక్తికర అంశాలను పొందుపరిచింది. భారత్ లో డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తుండగా, నగదు రహిత విధానాలు ఊపందుకున్నాయని... ఇలాంటి సమయంలోనూ నగదు చెల్లింపుల వేళ అత్యధికులు కోరుకునే నోటుగా రూ.100 నోటు నిలుస్తోందని ఆర్బీఐ పేర్కొంది. 

అయితే, దేశంలో పెద్ద మొత్తం నోటుగా ఉన్న రూ.2000 నోటు అత్యంత తక్కువమంది కోరుకునే నోటు అని వివరించింది. ఇక, అత్యధికంగా చెలామణీలో ఉన్న నోటు రూ.500 అని వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ, ఓ మోస్తరు పట్టణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ అంశాలు గుర్తించామని ఆర్బీఐ పేర్కొంది. అంతేకాదు, 3 శాతం ప్రజలకు కరెన్సీ నోట్లపై ఉన్న భద్రతా ఫీచర్ల గురించి ఏమాత్రం అవగాహన లేదన్న విషయం వెల్లడైందని తెలిపింది. 

ఇక, నాణేల విషయానికొస్తే... ఎక్కువమంది కోరుకునే నాణెం రూ.5 బిళ్ల అని రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. రూ.1 బిళ్లను చాలా తక్కువమంది కోరుకుంటున్నట్టు తెలిపింది. దీనిపై నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నిపుణుడు అయ్యల శ్రీహరి నాయుడు స్పందించారు. 

"రూ.100 కరెన్సీ నోటు అత్యధిక వాడకం అనేది ప్రజల ఆదాయ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. దేశంలో 90 శాతం మంది ప్రజలు అల్పాదాయ వర్గాలవారే. వారి రోజువారీ కొనుగోలు క్తి రూ.100-రూ.300 మధ్యలో ఉంటుంది. ఇలాంటి సమయాల్లో నగదు రహిత డిజిటల్ చెల్లింపుల కంటే నగదు చెల్లింపులకే ప్రాధాన్యత ఇస్తారు" అని వివరించారు.


More Telugu News