స్విమ్మింగ్ టెస్టు ఆన్ లైన్ లో నిర్వహిస్తారట!... నవ్వులపాలవుతున్న చైనా వర్సిటీ ప్రకటన

  • చైనాలో కరోనా మళ్లీ విజృంభణ
  • షాంఘైలో లాక్ డౌన్
  • అన్ని పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న షాంఘై వర్సిటీ
  • స్విమ్మింగ్ టెస్టును కూడా ఆన్ లైన్ లో చేర్చిన వైనం
చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో, ప్రఖ్యాత షాంఘై యూనివర్సిటీ చేసిన ఓ ప్రకటన హాస్యాస్పదంగా మారింది. షాంఘై యూనివర్సిటీ డీన్ కార్యాలయం నుంచి ఈ నెల 15న ఓ ప్రకటన వెలువడింది. సీనియర్ విద్యార్థులకు స్విమ్మింగ్ ఈవెంట్ ఫైనల్ పోటీలు ఆన్ లైన్ లో నిర్వహిస్తామన్నది ఆ ప్రకటన సారాంశం. ఆన్ లైన్ లో ఈత ఎలా కొడతారన్న ఇంగితం మర్చిపోయి ఆ ప్రకటన చేసిన వర్సిటీ వర్గాల తీరు నవ్వులపాలవుతోంది. 

సోషల్ మీడియాలో అయితే దీనిపై పొట్టచెక్కలయ్యేలా నవ్వించే మీమ్స్ వెలువడుతున్నాయి. వెబ్ ప్రపంచంలో ఈదడంలో ఇదేమైనా కొత్త వెర్షనా? అంటూ మరికొందరు, మా ఇంట్లోనే బాత్ టబ్ లో ఈదుతాం... అనుమతిస్తారా? అని మరికొందరు షాంఘై వర్సిటీ ప్రకటనపై వ్యంగ్యం కురిపిస్తున్నారు. చైనాలో ప్రముఖ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్టులో పాల్గొనాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ల గ్రాడ్యుయేషన్ పరిపూర్ణమైనట్టు! 

షాంఘై వర్సిటీ డీన్ కార్యాలయ ఉద్యోగి ఒకరు తమ ప్రకటనపై ఇచ్చిన వివరణ మరింత విస్మయం కలిగిస్తోంది. షాంఘైలో కరోనా వ్యాప్తి కారణంగా ఏప్రిల్ 1 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉందని, అందుకే స్విమ్మింగ్ టెస్టును ఆన్ లైన్ లో నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ ఉద్యోగి సెలవిచ్చాడు. విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకునే క్రమంలో అన్ని పరీక్షలతో పాటు స్విమ్మింగ్ టెస్టును కూడా ఆన్ లైన్ విధానంలో చేర్చామని వివరణ ఇచ్చాడు. ఏదేమైనా ఈ చైనా వర్సిటీ ప్రకటన సోషల్ మీడియాలో భారీ ఎత్తున మీమ్స్ కు కారణమవుతోంది.


More Telugu News