వీఐపీలకు భద్రత తొలగింపు.. పంజాబ్ లోని మాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • రాజకీయ నేతలు, మతపెద్దలు, రిటైర్డ్ పోలీసు అధికారులకు సెక్యూరిటీ కట్
  • 424 మందికి భద్రత తొలగించిన సర్కార్
  • ఏప్రిల్ లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు తొలగింపు
భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. వీఐపీ సంస్కృతికి శుభం కార్డ్ వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భగవంత్ మాన్ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజకీయ ప్రముఖులు, మత పెద్దల భద్రతనూ రద్దు చేసింది. 

రాజకీయ నేతలు, మత పెద్దలు, రిటైర్డ్ పోలీసు అధికారులు 424 మందికి భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. అందులో డేరా రాధ సోమీ బ్యాస్ కు ఉన్న 10 మంది భద్రతా సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఏప్రిల్ లో మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, పలువురు మాజీ మంత్రులు, ఇతర నేతలు సహా 184 మంది భద్రతను ఉపసంహరించుకున్నట్టు మాన్ ప్రభుత్వం ప్రకటించింది. 

ఆ నిర్ణయంతో 400 మంది పోలీసులు మళ్లీ స్టేషన్ డ్యూటీలు చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలిగానీ.. వీఐపీలకు భద్రత పేరుతో జనానికి ఇబ్బందులు కలిగించకూడదని మాన్ అన్నారు. మరోవైపు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలోనూ మాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఇకపై ఎవరైనా ఎన్నిసార్లైనా ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్క పదవీకాలానికి సంబంధించిన పింఛను మాత్రమే వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకు రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల దాకా పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలున్నారని, తాము తీసుకున్న నిర్ణయంతో కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని చెప్పారు.


More Telugu News