ఈ కామర్స్ వేదికలపై ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టనున్న కేంద్రం

  • అంతర్జాతీయంగా అమల్లో ఉన్న మెరుగైన విధానాల అధ్యయనం
  • అనంతరం కొత్త మార్గదర్శకాలు తెస్తామన్న వినియోగదారుల వ్యవహారాల శాఖ
  • వివిధ భాగస్వాములతో సమావేశంలో చర్చించిన కేంద్రం
ఆన్ లైన్ షాపింగ్ లో ఏదైనా కొనుగోలు చేసే ముందు ఏం చేస్తారు..? అప్పటికే వాటిని కొని వినియోగించిన వారు ఎలా ఉందో చెబుతూ ఇచ్చిన రివ్యూలను చూస్తారు. ఆ తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఆ రివ్యూలే ఫేక్ అయితే, కొనుగోలు దిశగా ప్రోత్సహించేందుకు కావాలని సానుకూల రివ్యూలు రాయిస్తుంటే..? వినియోగదారులను మోసపుచ్చడమే అవుతుంది. కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఈ తరహా అనైతిక వ్యవహారాలకే పాల్పడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటికి చెక్ పెట్టాలని భావిస్తోంది. 

ఈ కామర్స్ వెబ్ సైట్లలో పోస్ట్ చేసే నకిలీ రివ్యూలకు చెక్ పెట్టేందుకు వీలుగా అవసరమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న నకిలీ రివ్యూలు ఏ స్థాయిలో ఉంటాయన్న దానిపై కేంద్రం దృష్టి సారించింది. వివిధ భాగస్వాములతో ఒక సమావేశం నిర్వహించింది. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని కూడా సమీక్షించి నూతన నిబంధనలు, మార్గదర్శకాలను తీసుకురానున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది.

‘‘రివ్యూ ఇచ్చే వ్యక్తి గుర్తింపు, ప్లాట్ ఫామ్ కు ఉండే బాధ్యత అన్నవి రెండు కీలకమైన అంశాలు. ఈ కామర్స్ సంస్థలు మోస్ట్ రిలవెంట్ రివ్యూలను చూపిస్తుంటాయి. వాటిని పారదర్శక విధానంలో ఎలా ఎంపిక చేస్తున్నది అవి తప్పకుండా వెల్లడించాల్సిందే’’ అని వినియోగదారుల వ్యవహారాల శాఖ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహించిన తాజా సమావేశంలో ఈ కామర్స్ సంస్థలు, కన్జ్యూమర్ ఫోరమ్ లు, న్యాయ వర్సిటీలు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ, హక్కుల కార్యకర్తలు పాల్గొన్నారు.


More Telugu News