ఈ రోజు ఆ మహనీయుడు బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడిని: రాజేంద్రప్రసాద్

  • ఎన్టీఆర్ తనకు దేవుడన్న రాజేంద్రప్రసాద్ 
  • సమాజమే దేవాలయమని నమ్మిన గొప్ప వ్యక్తని కితాబు  
  • మన కళ్లతో చూసిన దేవుడు ఎన్టీఆర్ అంటూ ప్రశంసలు 
దివంగత నందమూరి తారకరామారావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. అదే క్రమంలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఎన్టీఆర్ పెట్టిన భిక్ష వల్లే తాను ఒక నటుడిగా అందరి ముందు ఉన్నానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తనకు ఎన్టీఆరే దేవుడని అన్నారు. కొన్ని ఏళ్ల పాటు తాను ఆయన పక్కనే ఉన్నానని తెలిపారు. సమాజమే దేవాలయం అని నమ్మిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మన కళ్లతో మనం చూసిన దేవుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ఈ రోజు ఆ మహనీయుడు బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని అన్నారు. ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయని చెప్పారు. పది మందికీ సహాయం చేయడమే ఎన్టీఆర్ కు మనం ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.


More Telugu News