దర్శకుడిగా నా కెరియర్ ను మలుపు తిప్పింది అన్నగారే: రాఘవేంద్రరావు

  • ఈ రోజున ఎన్టీఆర్ శత జయంతి 
  • ఆయనను తలచుకున్న రాఘవేంద్రరావు
  • దర్శకుడిగా తనని నిలబెట్టిన మహానటుడు అంటూ వ్యాఖ్య
  • ఆయనతో గడిపిన క్షణాలను మరిచిపోలేనన్న దర్శకేంద్రుడు 
ఈ రోజున ఎన్టీ రామారావు శత జయంతి .. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనతో తనకి గల అనుబంధాన్ని తలచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను కాలేజ్ రోజుల్లో అన్నగారి పౌరాణికాలు .. జానపదాలు బాగా చూసేవాడిని. రాముడిగా .. కృష్ణుడిగా ... రావణుడిగా ఆయన అనేక పాత్రలను పోషించారు. అప్పటి నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను. 

అసలు ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయగలమా అనుకున్నాను. అలా అనుకున్న నాకు భగవంతుడి దయవలన అసిస్టెంట్ డైరెక్టర్ గా 'పాండవ వనవాసం' సినిమాకి అన్నగారిపై క్లాప్ కొట్టే అవకాశం లభించింది. నిజంగా నేను ఎంతో అదృష్టవంతుడినని అనుకున్నాను. 

ఆ తరువాత  'అడవి రాముడు' సినిమాతో ఆయన నాకు దర్శకుడిగా అవకాశమిచ్చారు. ఆ సినిమాతో దర్శకుడిగా నా భవిష్యత్తుకు బంగారు బాటవేశారు .. ఆయన రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను. అంతే కాకుండా 'డ్రైవర్ రాముడు' .. 'వేటగాడు' .. ' జస్టీస్ చౌదరి' .. 'కొండవీటి సింహం' ఆఖరి చిత్రమైన 'మేజర్ చంద్రకాంత్' చేసే భాగ్యం కూడా నాకు కలిగింది. షూటింగు సమయంలో ఆయనతో గడిపిన క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను" అంటూ చెప్పుకొచ్చారు. 



More Telugu News