విరాళాలు ఖర్చు చేయని పార్టీల్లో వైసీపీ ఫస్ట్.. ఖర్చులో టీడీపీది అగ్రస్థానం

  • పార్టీల ఆదాయ, వ్యయ వివరాల నివేదిక వెల్లడించిన ఏడీఆర్
  • రూ. 107.99 కోట్ల విరాళాలతో వైసీపీకి రెండో స్థానం
  • వచ్చిన ఆదాయం కంటే 1,584.16 శాతం ఎక్కువగా ఖర్చు చేసిన టీడీపీ
  • అత్యధిక ఆదాయం సమకూర్చుకున్న పార్టీల్లో డీఎంకే ఫస్ట్
వచ్చిన విరాళాలకు మించి ఖర్చు చేయడంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఉంటే.. అతి తక్కువ వెచ్చించిన పార్టీల్లో వైఎస్సార్ సీపీ మొదటి స్థానంలో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు సమర్పించిన ఆదాయవ్యయ లెక్కల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

దీని ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి రూ. 107.99 కోట్లు విరాళాల రూపంలో రాగా, ఆ పార్టీ 80 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. అదే ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి రూ. 3.25 కోట్లు విరాళాలు రాగా, వచ్చిన దానికి మించి రూ. 54.76 కోట్లు వెచ్చించింది. టీఆర్ఎస్‌కు రూ. 37.65 కోట్లు రాగా అందులో రూ. 22.34 కోట్లు మాత్రమే ఖర్చు చేసి కొంత మిగుల్చుకుంది. ఈ లెక్కన వచ్చిన విరాళాలను ఖర్చు చేయని పార్టీల్లో వైసీపీకి దేశంలోనే అగ్రస్థానం దక్కగా, వచ్చిన ఆదాయం కంటే 1,584.16 శాతం ఎక్కువగా ఖర్చు చేసిన పార్టీగా టీడీపీ రికార్డులకెక్కింది. ఇక, అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని మజ్లిస్ పార్టీకి 1.62 కోట్ల విరాళాలు రాగా అందులో 0.194 కోట్లు ఖర్చు చేసింది.

ఇక, 2020-21లో మొత్తంగా 31 ప్రాంతీయ పార్టీలకు రూ. 529.41 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే అంతకుముందు ఆర్థిక సంవత్సరం వచ్చిన రూ. 800.26 కోట్లతో పోలిస్తే ఇది 34.96 శాతం తక్కువ కావడం గమనార్హం. ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు అందుకున్న వాటిలో డీఎంకే మొదటి స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి రూ.149.95 కోట్లు వచ్చింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా వైసీపీ (రూ.107.99 కోట్లు), బీజేడీ (రూ.73.34 కోట్లు), జేడీయూ (రూ. 65.31 కోట్లు), టీఆర్ఎస్ (రూ.37.65 కోట్లు) ఉన్నాయి. ఈ జాబితాలో టీడీపీది 11వ స్థానం.


More Telugu News