కుటుంబ పార్టీలు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి: కిషన్‌రెడ్డి

  • తెలంగాణ ప్రజలు చైతన్యవంతులయ్యారన్న కిషన్‌రెడ్డి
  • హుజూరాబాద్‌లో వందల కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేకపోయారని ఎద్దేవా
  • కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టీకరణ
  • వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ధీమా
కుటుంబ పార్టీలు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి పార్టీల కారణంగా దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులయ్యారని, అన్నీ జాగ్రత్తగా గమనిస్తున్నారని అన్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసినప్పటికీ హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తాము అనుకున్న వ్యక్తికే ఓట్లు వేశారని అన్నారు. 

తెలంగాణలో తప్పకుండా మార్పు వస్తుందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు నిస్తారని అన్నారు. సిద్ధాంతపరంగా కుటుంబ రాజకీయాలకు బీజేపీ పూర్తి వ్యతిరేకమని అన్నారు. టీఆర్ఎస్ తమపై ఎంతగా విషం చిమ్మినా ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేయబోరని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.


More Telugu News