డబ్బున్నోళ్లను ఇంకాస్త సంపన్నులను చేసే టోర్నీ ఐపీఎల్: డేవిడ్ లాయిడ్

  • ఐపీఎల్ పై అభిప్రాయాలు వెల్లడించిన ఇంగ్లండ్ మాజీ ఆటగాడు
  • విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీ బెస్ట్ అని కితాబు
  • ఐపీఎల్ భారత్ వరకు సరిపోతుందని వ్యాఖ్యలు
  • అక్కడ ఆటగాళ్లను దేవుళ్లలా చూస్తారని వెల్లడి
కాసుల వర్షం కురిపించే క్రికెట్ లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు పేరుంది. ప్రపంచ క్రికెట్ లీగ్ లన్నింటికీ ఇదే పెద్దన్న. అయితే, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత డేవిడ్ లాయిడ్ ఐపీఎల్ పై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఒక ప్రైవేట్ సంస్థ అని పేర్కొన్నారు. డబ్బున్న వాళ్లను ఇంకాస్త సంపన్నులుగా మార్చే లీగ్ ఐపీఎల్ అని తెలిపారు. అయితే, ఇంగ్లండ్ గడ్డపై జరిగే విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ అని డేవిడ్ లాయిడ్ అభివర్ణించారు. ఇది ప్రజల టోర్నీ అని, ఆటలోకి డబ్బును తీసుకురావడం అనేది విటాలిటీ బ్లాస్ట్ టోర్నీకే సాధ్యమని వివరించారు.

"నాణ్యత గురించి కాదు... టోర్నీ మన్నిక పరంగా ఆలోచిస్తే విటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్ తర్వాతే ఏదైనా అని చెబుతాను. ఇంగ్లండ్ ప్రేక్షకులను ఇది ఆకర్షిస్తున్న తీరు చూస్తుంటే క్రికెట్ వినోదం పరాకాష్ఠకు నిదర్శనంలా అనిపిస్తోంది. నేను ఐపీఎల్ లో కూడా పనిచేశాను. అక్కడ డబ్బున్నవాళ్లు ఇంకొంచెం డబ్బు పోగేసుకుంటారు. ఐపీఎల్ అనేది భారత ప్రేక్షకుల వరకు సరిపోతుందేమో... ఎందుకంటే అక్కడ క్రికెటర్లను దేవుళ్లుగా చూస్తారు. కానీ అది చాలా దారుణమైన విషయం. అక్కడ ఫలితానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అది నాకు నచ్చలేదు. క్రికెట్ ను వినోదంగానూ, ఓ సరదాగానూ చూడాలని నేను కోరుకుంటాను. అందుకే ఈ విషయంలో విటాలిటీ బ్లాస్ట్ టీ20 టోర్నీ బెస్ట్ అంటాను" అని వివరించారు.


More Telugu News