టీడీపీ మహానాడును వల్లకాడుతో పోల్చిన స్పీకర్ తమ్మినేని... ధ్వజమెత్తిన కూన రవి, వర్ల రామయ్య

  • ఒంగోలులో టీడీపీ మహానాడు
  • చచ్చిన పార్టీ అంటూ తమ్మినేని వ్యాఖ్యలు
  • తమ్మినేనిని ఆమదాలవలసలో సజీవదహనం చేస్తారన్న కూన
  • తమ్మినేనికి మతిభ్రమించిందన్న వర్ల రామయ్య
టీడీపీ మహానాడు కార్యక్రమంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటైన విమర్శలు చేశారు. టీడీపీ మహానాడు వల్లకాడు అని పేర్కొన్నారు. చచ్చిన పార్టీకి ప్రజలు అంతిమసంస్కారాలు చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ కథ ముగిసిందని, వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ మాయమైపోతుందని జోస్యం చెప్పారు. తమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూన రవి, వర్ల రామయ్య మండిపడ్డారు. 

తమ్మినేనిని ఆమదాలవలసలో సజీవదహనం చేయడం ఖాయమని, ఆయన పాడె మోయడానికి కూడా ఎవరూ రారని కూన రవి అన్నారు. టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానిస్తున్న వాళ్లకే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారని, వైసీపీ తన చితికి తానే నిప్పు పెట్టుకుంటోందని కూన రవి పేర్కొన్నారు. తమ్మినేని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం అని విమర్శించారు. 

వర్ల రామయ్య స్పందిస్తూ... తమ్మినేని సీతారాంకు మతిభ్రమించిందని అందుకే మహానాడును వల్లకాడుతో పోల్చి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడవరకు పార్టీలోనే ఉంటానని, పసుపు కండువా కప్పుకునే చస్తానని చెప్పిన తమ్మినేని ఇప్పుడొక మోసగాడి పక్షాన చేరి నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని వర్ల రామయ్య పేర్కొన్నారు. 

కాగా, టీడీపీ మహానాడు నేడు ఒంగోలులో ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర కీలకనేతలంతా హాజరు కావడంతో మహానాడు ఉత్సాహభరితంగా సాగుతోంది. అయితే, వైసీపీ నేతలు మాత్రం టీడీపీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.


More Telugu News