ఒక్కసారే అని కరెంట్ తీగ పట్టుకుంటే ఏమవుతుంది?: మహానాడులో చంద్రబాబు
- మహానాడులో జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు
- మద్య నిషేధం అని చెప్పి.. నాసి రకం బ్రాండ్లను అమ్ముతున్నారని ఫైర్
- ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేసేశారని మండిపాటు
ఒంగోలులో జరుగుతున్న మహానాడులో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్... ఇప్పుడు రాష్ట్రంలో నాసి రకం బ్రాండ్లను అమ్ముకుంటూ దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. పేదలకు ఇళ్లను కట్టిస్తామని చెప్పారని... కానీ, వైసీపీ దోపిడీ వల్ల ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని మండిపడ్డారు. వైసీపీ అవినీతి వల్ల రాష్ట్రం దివాలా తీసిందని చెప్పారు.
25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పిన జగన్... ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని అన్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేశాడని, ఆ తర్వాత మృతదేహాన్ని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రమాదంగా చిత్రీకరించారని విమర్శించారు. ఈ హత్యతో ప్రభుత్వంపై దళితుల్లో వ్యతిరేకత వచ్చిందని... దాన్ని కప్పిపుచ్చుకునేందుకు కోనసీమలో అల్లర్లను సృష్టించారని అన్నారు. వైసీపీ వాళ్లు సొంత ఇళ్లను తగులబెట్టుకుని కొత్త డ్రామాకు తెరలేపారని చెప్పారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఒక్కసారే కదా అని కరెంట్ తీగను పట్టుకుంటే ఏమవుతుందని ప్రశ్నించారు. తనకు సీఎం పదవి కొత్త కాదని.. ఎన్నో ఏళ్లు ఆ పదవిలో ఉండే అవకాశాన్ని ప్రజలు తనకు ఇచ్చారని... అయితే, రాష్ట్రం నాశనమయిందనేదే తన ఆవేదన అని అన్నారు. ప్రజలంతా బాధల్లో ఉన్నారని... వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.