ఈ మందుల కొనుగోలుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు!

  • ప్యారాసెటమాల్, దగ్గు, అలర్జీ మందులు
  • మొత్తం 16 ఔషధాల పేర్లతో ముసాయిదా జాబితా
  • వీటిని ఓటీసీ విభాగంగా ప్రకటించనున్న సర్కారు
  • వైద్యుల చీటీ లేకుండానే కొనుగోలుకు వీలు
వైద్యుల సిఫారసు లేఖ లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధాలను అమ్మడం నేరం. కానీ, మొదటిసారి మన దేశంలో కొన్ని రకాల ఔషధాలను ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) డ్రగ్స్ గా ప్రకటించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ 16 ఔషధాలతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను సిద్ధం చేసింది. దీంతో ఈ 16 రకాల ఔషధాలను ఫార్మసీ స్టోర్లు వైద్యుల సిఫారసు లేఖలు లేకపోయినా కస్టమర్లకు విక్రయించుకోవచ్చు.

చిగురు వాపునకు ఉపయోగించే క్లోరోహెక్సిడిన్ మౌత్ వాష్ ద్రావకం, యాంటీ సెప్టిక్, డిసిన్ఫెక్ట్ గా పనిచేసే ప్రొవైడిన్ అయోడిన్, యాంటీ ఫంగల్ మందు క్లోట్రిమజోల్ క్రీమ్, పౌడర్, దగ్గు ఉపశమనానికి వాడే డెక్స్ ట్రో మతార్ఫన్ హైడ్రోబ్రోమైడ్ లాజెంజెస్, యాంటీ హిస్టామిన్, యాంటీ అలర్జిక్ కు ఉపయోగించే డైఫెనిడ్రమైన్, నొప్పి నివారణకు వినియోగించే డైక్లో ఫెనాక్ క్రీమ్, జెల్, ఆయింట్ మెంట్ వీటిలో ఉన్నాయి.

అలాగే, సాధారణ నొప్పులు, జ్వరానికి వినియోగించే ప్యారాసెటమాల్ (డోలో, క్రోసిన్ లాంటివి), ముక్కు దిబ్బడకు వినియోగించే ఆక్సీమెటజోలైన్ నాసల్ సొల్యూషన్, జైలో మెటజోలైన్ హైడ్రోక్లోరైడ్, సోడియం క్లోరైడ్ నాసల్ స్ప్రే, చుండ్రు నివారణకు వినియోగించే కెటోకెన జోల్ షాంపూ, సాఫీ విరేచనానికి వినియోగించే లాక్టులోస్ సొల్యూషన్, బిసకోడిల్ ట్యాబ్లెట్లు, యాంటీసెప్టిక్ అయిన కేలమిన్ లోషన్ ను ఓటీసీ కింద ప్రతిపాదించింది.


More Telugu News