15 నిమిషాలు ఎదురు చూసినా సీటు ఇవ్వలేదు.. అందుకే వెళ్లిపోయా: కేంద్ర మాజీమంత్రి హర్షవర్ధన్

  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ కార్యక్రమం నుంచి హర్షవర్ధన్ నిష్క్రమణ
  • తనకు సీటు లేకపోవడం వల్లేనని వివరణ
  • కొత్త ఎల్జీ సక్సేనా సక్సెస్ కావాలంటూ అభినందనలు
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, బీజేపీ నేత డాక్టర్ హర్షవర్ధన్ అర్థాంతరంగా వెళ్లిపోవడంపై విమర్శలు వస్తుండడంతో.. ఆయన వివరణ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో ఆయన తెలియజేశారు. ఢిల్లీ 21వ లెఫ్టినెంట్ గవర్నర్ గా సక్సేనా ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం జరిగింది.

‘‘ఒక అధికారి నన్ను ఒక సీట్లో కూర్చోబెట్టారు. మరో అధికారి వచ్చి అది రిజర్వ్ డ్ సీటు అంటూ నన్ను ఖాళీ చేయించారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఎంపీగా, నా ప్రజా జీవితం అంతా ఢిల్లీలోనే సాగింది’’ అంటూ హర్షవర్ధన్ తెలిపారు.

 వినయ్ కుమార్ కు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన హయాంలో ఢిల్లీ ఉత్తమ నగరంగా అవతరించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమం నుంచి అర్థాంతరంగా కోపంతో వెళుతున్న హర్షవర్ధన్ వీడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసి, విమర్శలకు దిగడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.


More Telugu News