కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇస్తాంబుల్‌లో పోలీసులకు చిక్కిన కొత్త చీఫ్ అబు అల్ హసన్

  • ఇస్తాంబుల్‌లో నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో పట్టుబడిన అబుల్ అల్ హసన్
  • కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా కాకుండానే అరెస్ట్
  • మధ్య ప్రాచ్యంలో క్రమంగా క్షీణిస్తున్న ఐసిస్ ప్రాబల్యం
కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) కొత్త చీఫ్ అబు అల్ హసన్ అల్ ఖురేషీ టర్కీలోని ఇస్తాంబుల్‌లో పోలీసులకు చిక్కాడు. వాయవ్య సిరియాలో టర్కీ ఆధిపత్య తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న ఇడ్లిబ్‌లోని ఓ ఇంట్లో ఉన్న ఐసిస్ చీఫ్‌ను అమెరికా సేనలు మట్టుబెట్టిన తర్వాత అబూ అల్ హసన్‌ను కొత్త ‘ఖలీఫ్’గా ఐసిస్ ప్రకటించింది. ఐసిస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కూడా కాకముందే ఇప్పుడు పోలీసు ఆపరేషన్‌లో అతను పట్టుబడడం గమనార్హం.  

ఇస్తాంబుల్ పోలీసులు, ఉగ్రవాద నిరోధక విభాగాల నేతృత్వంలో రాజధానిలో నిర్వహించిన ‘అత్యంత రహస్య ఆపరేషన్‌లో టర్కీ భద్రతా దళాలు అబూ హసన్‌ను అరెస్టు చేసినట్లు టర్కీ న్యూస్ వెబ్‌సైట్ ‘ఒడా టీవీ’ పేర్కొంది. ఐసిస్ చీఫ్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు తెలియజేశాయని, త్వరలోనే ఆయనీ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని వెబ్‌సైట్ వివరించింది. 

ఐసిస్ ప్రాబల్యం మధ్యప్రాచ్యంలో క్రమంగా క్షీణిస్తోంది. 2019లో దాని చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ మరణించిన తర్వాత అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ ఉగ్రవాద సంస్థ బాధ్యతలు చేపట్టాడు. అయితే, వాయవ్య సిరియాలో అమెరికా భద్రతా బలగాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో  ఆపరేషన్‌ నిర్వహించాయి. కానీ, అమెరికా బలగాలకు చిక్కకుండా అబూ ఇబ్రహీం తనను తాను బాంబులతో పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో అతడితోపాటు ఆయన కుటుంబం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు కొత్త చీఫ్ అయిన అబుల్ అల్ హసన్ ఇస్తాంబుల్‌లో పట్టుబడడం ఐసిస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.


More Telugu News