తుని అంశంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి బొత్స

  • కోనసీమ జిల్లా పేరు మార్పు
  • భగ్గుమన్న అమలాపురం
  • వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధించిన పవన్
  • తీవ్రస్థాయిలో స్పందించిన బొత్స
కోనసీమ జిల్లాకు ప్రభుత్వం పేరు మార్చడం, అమలాపురంలో తీవ్ర విధ్వంసం చోటుచేసుకోవడం తెలిసిందే. దీనిపై విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కోనసీమ అల్లర్ల వెనుక భారీ రాజకీయ కుట్ర ఉందని, అందుకు కారకులైన వారిని గుర్తించి శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల్లో కుట్రదారుల పేర్లు బయటికి వస్తాయని అన్నారు. 

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో అతడికే అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. జిల్లా పేరు మార్పు కోసం 30 రోజులు సమయం ఇవ్వడం ఒక నిబంధన అని, పవన్ కల్యాణ్ ఏమీ తెలియకుండా మాట్లాడుతుండడం పట్ల అతడిపై సానుభూతి కలుగుతోందని అన్నారు. 

తుని అంశంలో, కాపు ఉద్యమాన్ని కించపరిచేలా పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని బొత్స డిమాండ్ చేశారు. లేకపోతే పవన్ ను ప్రజలు క్షమించరని అన్నారు. తుని సంఘటనలో తన పేరుతో పాటు ముద్రగడ పద్మనాభం, పల్లంరాజుల పేర్లు ఉన్నాయని, వాళ్లు కూడా వైసీపీ నేతలా? అని పవన్ ను ప్రశ్నించారు. 

అటు, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ నేతల ఇళ్లను తామే ఎందుకు తగలబెట్టిస్తామని ప్రశ్నించారు. మామ ఇంటిపై రాళ్లు వేయించి, అల్లర్లు సృష్టించిన చరిత్ర తమది కాదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరుపెట్టాలని విపక్షాలు కోరలేదా? అని బొత్స నిలదీశారు.


More Telugu News