స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు... సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

  • వ్యభిచారం అంశంపై సుప్రీంకోర్టు ఆసక్తికర విచారణ
  • పోలీసులకు ఆరు ఆదేశాలు జారీ
  • వ్యభిచారం ఓ వృత్తి అని స్పష్టీకరణ
  • పోలీసులు జోక్యం చేసుకోలేరని వెల్లడి
  • సెక్స్ వర్కర్లకు చట్టప్రకారం సమాన రక్షణ కల్పించాలని ఆదేశం
వ్యభిచారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వ్యభిచారం ఓ వృత్తి అని, పోలీసులు అందులో జోక్యం చేసుకోలేరని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు కూడా గౌరవం ఇవ్వాలని, చట్ట ప్రకారం వారికి కూడా సమాన రక్షణ కల్పించాలని పేర్కొంది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సెక్స్ వర్కర్ల హక్కులకు భద్రత కలిగించేలా 6 అంశాల్లో ఆదేశాలు జారీ చేసింది.

  • సెక్స్ వర్కర్లను కూడా చట్టం యొక్క సమాన రక్షణకు అర్హులుగా పరిగణించాలి.
  • అన్ని కేసుల్లో వయసు, సమ్మతి ఆధారంగా క్రిమినల్ చట్టాన్ని సమానంగా వర్తింపజేయాలి.
  • ఓ సెక్స్ వర్కర్ మేజర్ అయి ఉండి, పూర్తి సమ్మతితో వ్యభిచారంలో పాల్గొంటే, పోలీసులు జోక్యం చేసుకోజాలరు. ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు ఎలాంటి క్రిమినల్ యాక్షన్ తీసుకోరాదు.
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. అందుకు వృత్తితో సంబంధం లేదు.
  • సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయడం కానీ, వారిపై జరిమానా వేయడం కానీ, వారిని వేధించడం కానీ చేయరాదు. ఎందుకంటే, స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరమేమీ కాదు. వ్యభిచార గృహం నిర్వహించడం ఒక్కటే నేరం.
  • తల్లి వ్యభిచారి అయినంత మాత్రాన ఆమె నుంచి బిడ్డను వేరుచేయరాదు. కనీస మానవీయ కోణంలో ఆమెకు, ఆమె బిడ్డలకు భద్రత కల్పించాలి. ఒకవేళ మైనర్లు ఎవరైనా సెక్స్ వర్కర్లతో కలిసి నివసిస్తుంటే వారిని అక్రమ రవాణా చేసినట్టుగా భావించరాదు.

అంతేకాదు... సెక్స్ వర్కర్లు ఏదైనా అంశంలో ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు వారి పట్ల పోలీసులు వివక్ష ప్రదర్శించరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వ్యభిచారం నేపథ్యంలో, వారిపై ఏదైనా దాడులు జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదు స్వీకరణ నిరాకరించరాదని స్పష్టం చేసింది. లైంగిక దాడికి గురైన పక్షంలో సెక్స్ వర్కర్లకు ప్రతి ఒక్క సదుపాయం కల్పించాల్సిందేనని, తక్షణ మెడికో-లీగల్ సాయం కూడా అందించాలని ఆదేశించింది. 

కొన్ని సందర్భాల్లో సెక్స్ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి దారుణంగా, హింసాత్మక రీతిలో ఉంటున్న ఘటనలను తాము గుర్తించామని త్రిసభ్య ధర్మానసం వెల్లడించింది. వారు కూడా సమాజంలో ఓ వర్గమేనని, కానీ వారి హక్కులు గుర్తింపునకు నోచుకోలేదని వ్యాఖ్యానించింది. 

ఈ సందర్భంగా మీడియాకు కూడా సుప్రీం బెంచ్ హితవు పలికింది. ఏదేనీ సందర్భాల్లో సెక్స్ వర్కర్ల పేర్లను బయటికి వెల్లడించకుండా మీడియా అత్యంత జాగ్రత్త వహించాలని స్పష్టం చేసింది. రెయిడ్లు, అరెస్టులు, రెస్క్యూ ఆపరేషన్లు సందర్భంగా వారు బాధితులైనా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా పేర్లను మాత్రం బహిర్గతం చేయరాదని ఆదేశించింది. వారి ఫొటోలను ప్రచురించడం కానీ, టీవీల్లో ప్రసారం చేయడం కానీ చేయరాదని వెల్లడించింది. 

ఓ సెక్స్ వర్కర్ వద్ద కండోమ్స్ ఉండడాన్ని ఆమె నేరం చేసిందనడానికి ఆధారాలుగా పోలీసులు భావించరాదని సుప్రీం కోర్టు నిర్దేశించింది. 

రెస్క్యూ ఆపరేషన్ల ద్వారా కాపాడిన సెక్స్ వర్కర్లను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి... రెండు మూడేళ్లకు తక్కువ కాకుండా వారిని పరివర్తన గృహాలకు తరలించాలని సూచించింది. ఒకవేళ సెక్స్ వర్కర్ ఎవరైనా ఈ గృహం నుంచి బయటికి వెళ్లిపోవాలని భావించి, అందుకు మేజిస్ట్రేట్ కూడా అంగీకరిస్తే వారిని బయటికి పంపించి వేయవచ్చని తెలిపింది. సెక్స్ వర్కర్లను వారి ఇష్టాయిష్టాలకు విరుద్ధంగా పరివర్తన గృహాల్లో ఉండాలని అధికారులు బలవంతం చేయలేరని జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 

వ్యభిచారానికి సంబంధించిన ఈ అంశంలో తదుపరి విచారణను జులై 27కి వాయిదా వేస్తున్నామని వెల్లడించింది. తాము నిర్దేశించిన అంశాలపై అప్పట్లోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


More Telugu News